పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

స్వీయ చరిత్రము.

తమకేమి పరాభవము వచ్చునోయని ప్రొద్దుగ్రుంకకముందే మెల్లఁగా నావలికి జాఱిరి. సభవారును మొదట నుద్దేశించుకొని వచ్చినపనిని జరప నేరక తమ యిండ్లకుఁ బోవలసినవా రయిరి. దేవాలయమున కెదురుగానుండిన పత్రికా వహనకార్యస్థానములో నుద్యోగములో నుండినవారును నామిత్రులును నగు కొచ్చెర్లకోట సుందరరామయ్య గారు మేడమీఁద నిలుచుండి దేవాలయములో నడచుచున్న దంతయుఁ జూచుచుండి, నేను వీధిలోనికి రాఁగానే మేడదిగి వచ్చి నన్నుఁ గలిసికొని బ్రాహ్మణులు నావిషయమయి చేయఁదలఁచుకొన్న దుష్టప్రయత్నము తనకుఁ దెలియరాఁగా సమయము వచ్చినప్పుడు పంపి వారిని మర్దింపించుటకయి టపాలు మోచువారిని పదుగురను సిద్ధముగా నుంచియుంటినని నాతోఁ జెప్పిరి. ఆదినము మొదలుకొని పట్టణములో సంక్షోభమును కక్షా వేశములును మఱింత ప్రబలసాగెను,

1880, 1881 వ సంవత్సరములలో మావివేకవర్ధనియు ప్రార్థానాసమాజమును విద్యార్థుల సంఘసంస్కరణసమాజమునుగూడ మహోత్సాహముతో మిక్కిలి చుఱుకుగాఁ బనిచేయుచుండెను. విరూపాక్షపీఠస్థులైన మాశంకరాచార్యస్వాములవారు విజయనగరమునుండి బైలుదేఱి దారిపొడుగునను భిక్షలును పాదపూజలును గైకొనుచు మాగోదావరీమండలమునకు వచ్చుచుండిరి. ఇట్టి యాచార్యస్వాములవారు భిక్షలని పాదపూజలని పేరులు చెప్ప ధనాకర్షణము చేయుచుండుటయేకాని సాధారణముగా శిష్యులకు మతబోధ చేయవలెనన్న చింతయే వారికుండదు. వారిలోఁ గొందఱికి మతగ్రంథముల పేరుల కంటె భక్ష్యముల పేరులే యెక్కువగాఁ దెలియును. ఇందునుగూర్చిన పూర్వ కథ యొకటిగలదు. ఒక స్వాములవారొకగృహస్థునియింటికి భిక్షకు దయచేసిరఁట. భిక్షానంతరమున స్వాములవారు వేదాంతగ్రంథపారాయణము చేసి కొందురేమో యని తలఁచి యాయింటిగృహిణి యతీశ్వరునికడకు వచ్చి "స్వామీ ! భగవద్గీతలు తెత్తునా ?" యని యడిగెనఁట ! ఆపే రాస్వాములవారెన్నఁడును విన్నది కాకపోవుటచేతఁ గొంతసేపాలోచించి యదియు