పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

147

నట్లు మాలో మేము ప్రమాణములు చేసికొని, రహస్యముగా కార్యాలోచనము చేయుట కారంభించితిమి. మేమీప్రకారముగా కార్యములు జరపుటకు కృతనిశ్చయులమయి గూఢముగా పనిచేయుచుండుటయు, వివాహసమయమున భోజనముల కెవ్వరు వచ్చెదరో తాంబూలముల కెవ్వరు వచ్చెదరో ప్రతిపక్షము పూనక సహాయులుగా నెవ్వరుందురో తెలిసికొనుటకు లక్ష్మీ నరసింహముగారిలోపల రెండు సభలు చేయుటయు, తెలిసికొని స్త్రీ పునర్వివాహనిషేధపక్షమువారు భయపడి, మాప్రయత్నములు మాటలతోఁ బోక కార్యములకు వచ్చునట్లున్నవని సంచలించి తొందరపడి తమమాంద్యమును విడిచి చుఱుకుఁదనము వహించి తామును సభలుచేసి మాప్రయత్నములకు విఘ్నములు కలుగఁ జేయుటకయి యుపాయముల నాలోచింప మొదలు పెట్టిరి. ఒకదినమునఁ బూర్వాచార పరాయణులయిన లౌక్యులును వైదికులును మార్కండేయ స్వామియాలయములో సభచేరి నన్ను వర్ణమునుండి బహిష్కారము చేయుటకును విధవావివాహముల కేవిధమయిన తోడ్పాటు చూపెదమన్నను వారినందఱిని వెలివేసెదమని వెఱపించుటకును ముందే నిశ్చయించుకొని వచ్చి, తగుమనుష్యుని నొక్కనిఁ బంపి నన్నా దేవాలయమునకు రప్పించిరి. ఆసభా నాయకుల యనుమతితో మూర్ఖులైన యాపక్షపు బ్రాహ్మణులు కొందఱు సభావసానమునఁ బోవునప్పుడు సందడిలో నన్నుఁ గొట్టవలెనని యుద్దేశించుకొని వచ్చిరఁట ! ఈవార్త యెట్లో విద్యార్థులలో నొకరిద్దఱి చెవిసోఁకఁగానే సభ యారంభమయిన యరగంటలోపల దేవాలయమంతయు రెండువందల విద్యార్థులతో నిండిపోయినది. వారిలో ననేకులచేతులలో కఱ్ఱలుండినవి. కొందఱు విద్యార్థులు ముందుకు తోసికొనివచ్చి పెద్దమనుష్యుల నీవలావలలకుఁ దోసి నడుమను నాచుట్టును గూర్చుండిరి. ప్రతిపక్షుల దురాలోచన నాకప్పుడు తెలిసియుండక పోవుటచేత విద్యార్థులప్రవర్తనము నా కప్పు డవినయముగా తోఁచినది. నావిషయమయి దౌర్జన్యము జరగింపఁ దలఁచుకొని వచ్చిన యాదుష్టవిప్రులు విద్యార్థుల సంఖ్యనుజూచి భయపడి