పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

స్వీయ చరిత్రము.

సహాయులుగా నుండిరని చెప్పవలసి యున్నది. ఇప్పుడు వివాహములు చేసికొన్నవారిలో పులవర్తి శేషయ్యగారును నల్లగొండ కోదండరామయ్యగారును పైని జెప్పిన గ్రామములలో గొన్నిటికిఁబోయి కృషి చేసినందునకై నాకృతజ్ఞత నిక్కడఁ దెలుపుచున్నాను." [1]

మహారాజులు సహితము పూని నిర్వహింప లేకపోయిన యీమహా కార్యభారమును ధనవిద్యాధికారబలము లేని పిన్న వాండ్రము నలుగురైదుగురము పైని వ్రేసికొని శ్రమపడుచుండఁగా, ఇంతలో లోకానుభవమును విద్యాధికారములను నెక్కువగాఁ గలవారయి యీవిషయమున నత్యంతాదరము గలవారు సాయపడి మాకు చేయూఁతయయి నిలిచిరి. రాజమహేంద్రవరమునకుఁ గ్రొత్తగా న్యాయవాదిగా వచ్చిన న్యాపతి సుబ్బారావుపంతులుగారు మాలోఁజేరిరి. కాకినాడకు సబుజడ్జిగావచ్చిన శ్రీ కంచికృష్ణస్వామిరావు పంతులుగారు వాక్సహాయమునుజూపి మాకత్యంతప్రోత్సాహము కలిగింపఁ జొచ్చిరి. మొదటివివాహ మైదాఱుమాసములకు జరగుననఁగా ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు రాజమహేంద్రవరమునకు డిస్ట్రిక్టుమునసబుగావచ్చి మాకనేక విధముల తోడుపడఁ దొడఁగిరి ; చెన్న పట్టణమునకు చదువునిమిత్తమై పోయి యుండిన సోమంచి భీమశంకరముగారు మరలవచ్చి మమ్ముఁ జేరిరి. ఈప్రకారముగా మేము కొంతబలపడి రెండుసంవత్సరములు వాదప్రతివాదరూపమైన వాగ్యుద్ధమును నడపినతరువాత క్రియలేని నిరర్థకవాదములవలనఁ బ్రయోజనము లేదని తెలిసికొని, కష్టపడి యేలాగుననైనఁ గొన్ని వివాహములను జరపవలెనని నిస్ఛయించుకొని, ఆత్మూరి లక్ష్మీ నరసింహముగారును న్యాపతి సుబ్బారావు పంతులుగారును కొమ్ము రామలింగశాస్త్రిగారును బసవరాజు గవర్రాజుగారును నేనును జేరి యైదుగుర మొకయాంతరంగికసమాజముగా నేర్పడి, మాప్రయత్నముల నితరులతో మాప్రాణమిత్రులతో నైనను జెప్పకుండు

  1. స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమాన స్థితులు - జనేవరు 1887.