పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము.

5

శ్లాఘించి తనకాయన మాన్య మిచ్చి సత్కరించినవార్తను కరణముగారితోఁజెప్పెను. ఆయన తాను పారాయణముచేయుచుండిన రామాయణమును పీటపైఁ బెట్టి తత్క్షణమే లోపలికిఁబోయి యేమేమోయేర్పాటుచేసి యయిదాఱు నిమిషములలో మరలవచ్చి, నాయెడల నతిమాత్రాదరమును జూపుచుఁ దానెఱుఁగక చేసిన యవజ్ఞను క్షమింపుమని నన్ను వేఁడుకొనెను. ఈ సంభాషణమునకు ఫలముగా మాకు గంటలోపలనె కమ్మని యావునేతితోను గట్టి పెరుగుతోను రెండుకూరలతోను పిండివంటతోను సుఖభోజనము లభించెను. భోజనానంతరమున నే నాగృహపతికిని ముసలిబ్రాహ్మణునకును నమస్కారములుచేసి నాకృతజ్ఞతను దెలిపి సెలవు గైకొనిపోయి పడవ యెక్కి సాయంకాలమునకు ధవళేశ్వరముచేరి గృహము ప్రవేశించితిని. నేను పుట్టుట కొక్క సంవత్సరము పూర్వమే లోకాంతరగతులగుటచేత నాతాతగారిని నే నెఱుఁగకపోయినను, అటువంటి పితామహునకుఁ బౌత్రుఁడ నన్నగర్వ మీవృత్తాంతము స్మరణకు వచ్చినప్పు డెల్ల నిప్పటికిని నామనస్సులోఁ గలుగుచుండును.

నావివాహము మొదలైన శుభకార్యములకుముం దెల్లను నాపెదతండ్రి గారు నాజన్మపత్రమును జ్యోతిష్కుల కెల్లఁ జూపుచు సుముహూర్తములు పెట్టించుచు వచ్చినను, జ్యోతిశ్శాస్త్రములోని ముహూర్తజాతకభాగముల యందలి నమ్మకము నాకు చిరకాలము క్రిందటనే చెడినందున నేను స్వతంత్రుఁడ నయినతరువాత నాజన్మపత్రమును జూచుటకయినను నేనెన్నఁడును బ్రయత్నము చేసియుండలేదు. నాజన్మపత్రిక నాయొద్దనున్నదనికూడ నేనెఱుఁగకుంటిని. కొన్ని సంవత్సరముల క్రిందట నొక పనికయి మాయింటనున్న ప్రాఁతకాగితములను వెదకుచుండఁగా నా పెదతండ్రిగారి మామగారయిన బుద్ధిరాజు కనకరాజుగారిచేత వ్రాయఁబడిన నాజన్మపత్రిక యొకటి యాకస్మికముగా నాకంటఁ బడెను. దానిఫలవిషయమయి నాకెంతమాత్రమును విశ్వాసము లేకపోయినను సత్యాన్వేషుల విమర్శకయి యుపయోగపడవచ్చునని నా జాతకచక్రము నిందుఁ బొందుపఱుచుచున్నాను—