పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

145

మీఁద వ్రాళ్ళు చేసిరి. ఇట్లు కాలక్రమమున శుభసూచకము లనేకములు కాన వచ్చినను, మే మీపని కారంభించినప్పుడు మాయొద్ద నొకకాసును నిధిగా లేదు ; ఎవరైన పెద్దమొత్తమిత్తు రన్న యాశయు మాకపుడులేదు. ఐనను గొన్ని వారములలోపలనే నాకు పరిచితులయిన శ్రీబారు రాజారావుపంతులు గారు శ్రీపైడా రామకృష్ణయ్యగారు రాజమహేంద్రవరమునకు వచ్చినప్పుడు నాకు వారితోడి మైత్రిని గలిగింపఁగా, వారప్పు డీపనినిమిత్తమయి ముప్పది వేలరూపాయల నిచ్చెదమని వాగ్దానము చేసిరి. ఈ వాగ్దానమువలన మాకు మఱింత యుత్సాహము గలిగి ద్విగుణధైర్యముతోఁ బనికి పూనినను, రెండు సంవత్సరములకు పిమ్మట ప్రథమవితంతువివాహ మగువఱకును పట్టిన సమస్త వ్యయములను నేనే వహించినాఁడను. "నేను చేసినయుపన్యాసములను ముద్రింపించి కొన్ని ప్రతులను విక్రయించినను విశేషభాగ మూరక పంచి పెట్టినాను; వాదమునిమిత్తమయి ముప్పదినలువదిస్మృతులను, ఇతరపుస్తకములను గొని కృషిచేసినాను ; బహు స్థలములయందున్న వారితో నుత్తరప్రత్యుత్తరములను జరపుచు, వలసినప్పుడితర స్థలములకుఁ గూడఁబోయి యుపన్యసించుచు వచ్చినాను; వివాహములు చేసికొనెదమని వాగ్దానములు చేసినవిద్యార్థులకుఁ గొందఱకు పాఠశాల జీతములకు సాహాయ్యముచేయుచు వచ్చినాను; బాలవితంతువు లున్న స్థలములను విచారించి సమాచారములు చెప్పుటకును కృషి చేయుటకును మనుష్యులకు సొమ్మిచ్చుచు వచ్చినాను; బాలవితంతువుల సంరక్షకులతో మాటాడుటకయి, అమలాపురము, మండపేట, తాళ్లపూడి, కాకినాడ, దొడ్డిపట్ల, విఝ్ఘేశ్వరము, రామచంద్రపురము, పాలకొల్లు మొదలైన స్థలములకు మనుష్యులను పంపుటయేకాక వీనిలో నొకటిరెండు స్థలములకు నేనును బోవుచు వచ్చినాను ; ఈప్రయాణములలో నొకసారి యొకపల్లెలో శీతకాలపురాత్రియం దొకమిత్రుఁడును నేనును పశువులపాకలోనిపశువులతోఁ గలిసి రొచ్చుకంపులో పరుండి నిద్రింపవలసి వచ్చినది. ఈకృషిలో నాకిక్కడి రాజకీయపాఠశాలలోని విద్యార్థులు మొదటినుండియు ముఖ్య