పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

స్వీయ చరిత్రము.

భము కలుగలేదు. ఇట్లుదౌర్జన్యముచూపి ప్రతిపక్షులు నన్ను మర్దింప యత్నించుట యొక్క కాకినాడలోనే కాదు. నాస్వస్థల మయిన రాజమహేంద్రవరములో సహిత మట్టిప్రయత్న మొకసారి జరగినది. చెన్న పట్టణమువంటి రాజధానీనగరములోనే స్త్రీ పునర్వివాహమునుగూర్చి చాకలిపేటలో నేనుపన్యాసమిచ్చుచున్న సమయమునం దచ్చటి వైష్ణవబ్రాహ్మణులు దొమ్మిచేసి నాపయిని బడఁబోఁగా రావుబహద్దూరు శ్రీపనప్పాకము అనంతాచార్యులవారు నన్ను తప్పించి తమబండిలో నెక్కించుకొని తీసికొనిరావలసి వచ్చినప్పుడు చిన్న పట్టణములలో మూఢులిట్టి దౌర్జన్యమునకుఁ గడఁగుట యొకవింత గాదు.

మొట్టమొదట స్త్రీ పునర్వివాహసమాజ మని పేరు పెట్టుకొని పనిచేయ నారంభించినవారము నేనును నామిత్రులగు చల్లపల్లి బాపయ్యపంతులు గారును బసవరాజు గవర్రాజుగారును ఏలూరి లక్ష్మీనరసింహముగారును బయపునేడి వేంకటజోగయ్యగారును కన్నమురెడ్డి పార్థసారథినాయఁడుగారును ; చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రిగారు కాజ రామకృష్ణారావుగారు కొమ్ము రామలింగశాస్త్రిగారు మొదలైనవారుకూడఁ గొందఱు మాలో నటుతరువాత జేరిరి. ఈవిషయమయి తఱుచుగా వాదప్రతివాదములు జరగుచు వచ్చుట చేత విధవావివాహ మన్న శబ్ద మారంభదశయందువలె శ్రుతికటువుగానుండక కొంతకాలములో జనుల కది పరిచితపదమయి సహ్యమయినది. అనేకులకు విధవావివాహములు శాస్త్రసమ్మతము లనియు, అవశ్యా చరణీయములనియు, అభిప్రాయము కలుగసాగెను. బాలవితంతువులసంరక్షకు లనేకులు తమవితంతుకన్యలకు పునర్వివాహములు చేయ నుద్దేశించుకొన మొదలుపెట్టిరి. వితంతు కన్యలు దొరకినపక్షమున తాము వివాహమాడెద మని మాశాస్త్రపాఠశాలలోని విధ్యార్థు లనేకులు బైలుదేఱిరి. నేనును నామిత్రులగు బాపయ్యపంతులుగారును బోయి యింటింటికిని దిరిగియడుగఁగా లౌక్యులయిన బ్రాహ్మణ గృహస్థులు ముప్పదిమందికంటె నెక్కువసంఖ్యగలవారు వివాహసమయము నందు తాము భోజనములకు వచ్చెదమని వాగ్దానములు చేసి సమాఖ్యపత్రము