పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

143

నప్పు డింటికడ వ్రాసి తెచ్చుకొన్న తమ యభిప్రాయము జదువుటకయి రొండిని బెట్టుకొని తెచ్చిన కాగితమును బయికిఁదీసి మడత విప్పి నిషేధవాదుల కనుకూలముగా తమ యాశయమును జదువ నారంభించిరి. అంతట సభ్యుల కామధ్యస్థునియొక్క న్యాయపక్షావలంబమును సత్యశీలతయు యోగ్యతయుఁ దెలిసి యిఁక నభిప్రాయము నీయవలదని వారించిరి. మనలో పండితు లనఁబడువారే నీతిమాలి యెంతటి మోసములకును నన్యాయములకును లోఁబడుదురో ! అప్పుడు ప్రతిపక్షులు తా మేమో చెప్పరాఁగా నుపన్యాసము ముగియువఱకును జెప్పఁగూడదని సభాధ్యక్షులు వారిని వారించిరి. అప్పుడు కప్పగంతుల రామశాస్త్రిగారు తాను సభలో నుండి విననని లేచి పోయెను ; ఆయనవెంట నోగిరాల జగన్నాథముగారును మఱి యిద్దఱుముగ్గురును లేచివెళ్ళిరి. తాను జేసిన మోసముచేత సభలో నుండలేక యచ్చన్న శాస్త్రిగారును సంధ్యాసమయమయినదని మిష పెట్టి లేచిపోయెను. అంతటఁ బ్రతిపక్షులైన బ్రాహ్మణులు కొంద ఱల్లరిచేయవలెనన్న యుద్దేశముతో దేవాలయద్వారముకడ తోపులాట కారంభింపఁగా, కావలి యున్న యారక్షక భటులు వారిని వారించిరి. ఇంతలోఁ జీఁకటిపడినందున మఱి కొందఱులోపలఁ బ్రవేశించి యల్లరిచేయ నారంభించిరి. రాజమహేంద్రవరమునుండి కొందఱు విద్యార్థులు నా కంగరక్షకులుగా వచ్చియుండిరి. ప్రతిపక్షులు రాళ్ళు రువ్వుట కారంభించి నన్ను మర్దింప యత్నించుచుండఁగా, నాతోడవచ్చిన విద్యార్థులు దొమ్ములాటకయి వచ్చినయల్లరిమూకతో దలపడి వారికి నాయకుఁడై యుండిన బ్రాహ్మణుని దిట్టముగాఁ గొట్టుటచేతను తత్పట్టణారక్షక భటాధికారియు నామిత్రుఁడునైన గుమ్మిడిదల మనోహరము పంతులుగారు వచ్చి యాయల్లరిమూఁకను కొట్టులోఁ బెట్టింపఁజూచుటచేతను వేగముగానే యాదుండగపు బాపనగుంపు చెదరి పలాయనమయ్యెను. ఈ యల్లరిచేత నాటి కుపన్యాసము ముగియకుండనే సభ చాలింపఁబడినది. ఎదుటివాదము వినకుండ నల్లరిచేసినందువలన వారిదౌష్ట్యము వెల్లడియగుటతప్ప వారిపక్షమునకు వేఱులా