పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

141

మాపయిభానువారమునాఁడు ఖండనోపన్యాసము నిచ్చెద మని సెలవిచ్చిరి. వారు చేసెడు పూర్వపక్షములనువిని నాకు తోఁచిన సమాధానములను జెప్పుటకయి యాయాదిత్యవారమునాఁడు రాజమహేంద్రవరమునుండి నేనక్కడకుఁ బోయితిని. ఆహ్వానపత్రికల ననుసరించి స్త్రీపునర్వివాహ విధాయకపక్ష వాదులు యుక్తసమయమునకే పాఠశాలామందిరమునకుఁ బోయి యుండినను, పండితులు మొదలగువారు తామక్కడకు రామనియు దేవాలయములో సభ చేసెడుపక్షమున వత్తుమనియు వర్తమానము పంపినందున వారి యిష్టానుసారముగా నేనును నాసహాయులును విష్ణ్వాలయమునకుఁ బోయితిమి. ఆహ్వాన పత్రిక ననుసరించి పలువురు పాఠశాలామందిరమునకుఁ బోయిరికాని యచ్చట సభలేనందున వారిలోఁ గొందఱుమాత్రమే యచ్చటనుండి మరల దేవాలయమునకు రాఁగలిగిరి. అటుతరువాత మిక్కిలియాలస్యముగా సభయారంభింపఁ బడఁగా, విధవావివాహనిషేధవాదులు నేను జేసిన యుపన్యాసమునకు ఖండన మని నాచేఁ జెప్పఁబడనివియుఁ జెప్పఁబడినవియునైన కొన్ని విషయములకుఁ బ్రత్యుత్తరముగా నొకగ్రంథమును జదువ నారంభించిరి. వేదార్థవిచారము ముగియునప్పటికే ప్రొద్దుగ్రుంకినందునస్మృతిభాగమును మఱునాఁడు ప్రాతఃకాలమునఁ జదువవచ్చునని నాఁటికి సభచాలింపఁ బడినది. మఱునాటియుదయమునఁగూడ వారు మిక్కిలి యాలస్యముగానే వచ్చినందున స్మృతిభాగము యొక్క యర్థమునుగూర్చి వారు గ్రంథమును ముగించునప్పటికి పదిగడియల ప్రొద్దెక్కినది. నిషేధవాదము ముగిసినతరువాత విధాయక వాదులయుత్తరమును వినవలెనని మొదటనే నిశ్చయింపఁ బడినను, విధవా వివాహనిషేధ వాదులు తమ ఖండనగ్రంథముమీఁద విధాయకవాదు లేమియుఁ జెప్పఁగూడదని వాదింప మొదలు పెట్టిరి. అప్పుడు సభలో వారిమాట చెల్లనందున తాము మధ్యాహ్నమున జరుగఁబోవు సభకురామని వారందఱును వెడలిపోయిరి. వారు మధ్యాహ్నము సభకు రామని నిరాకరించుటచేతనే వారివాదము దుర్బలమయినదని యచ్చటనున్నవా రనేకు లభిప్రాయపడిరి. మరల మధ్యా