పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

137

జ్యధార యయి వారిని మఱింత మండిపడునట్లు చేసినది. ఆదినమున వాద మెట్లు జరగునో వినవలెననియు, పండితుల విజయమును చూడవలెననియు, బాలవితంతువుల దుర్దశానివారణమునకు గతి యే మైన నేర్పడెడియాశ కలుగునేమో కనవలెననియు, వివిధాభిప్రాయములతో గుంపులుగుంపులుగా వేడుక చూడవచ్చిన జనులతో నిండి యయిదాఱువందల జనులు పట్టఁదగిన సభా భవన మంతయు క్రిక్కిఱిసిపోయినది. నాయుపన్యాసము ముగియఁగానే వృషభముమీఁదికిఁ గుప్పించు వ్యాఘ్రములవలె నామహాసభలోనుండి పండితులనేకులు లేచి భయంకరారావములతో నన్నుఁగవిసిరి. వారిలో శ్రీశంకరాచార్యస్వాములవారియొద్ద పండితులుగాఁ గొంతకాల ముండిన యద్దేపల్లి కృష్ణశాస్త్రులుగారు మొదలయినవారు తమ పాండిత్య ప్రభావమును గనఁబఱచి నన్ను బహువిధముల దూషించి, నష్టేమృతేత్యాదిపరాశర స్మృతివచనమున కనేక విపరీతార్థములు కల్పించి నాయర్థమును పరిహసించి, ప్రత్యుత్తరము చెప్పుటకు నాకవకాశ మియ్యక, పయివారము నీయుపన్యాసము మీఁద ఖండనోపన్యాసములు వ్రాసి చదివెదమని చెప్పి, నాటికి సభనుండి వెడలిపోయిరి. ఆదినముమొదలుకొని పట్టణములోని ప్రతిగృహమునందును స్త్రీ పునర్వివాహవిషయమయిన చర్చలే జరగ నారంభించినవి ; జను లేవీధిని జూచినను స్త్రీ పునర్వివాహవిషయక ప్రసంగములనే చేయఁజొచ్చిరి. ఆవఱ కితరవిషయములయందు భూషించువారును నన్నీ విషయమునందు దూషింప నారంభించిరి; నామిత్రులు సహితము నన్ను నిరుత్సాహ పఱుపసాగిరి ; వాదము నిమిత్తమయి నే నేగ్రంధము నడిగినను పండితులు నాకొక్కసారి యెరవియ్యక పోవుటయేకాక గ్రంథ నామములయినను నాకు తెలుపక మఱుఁగుపఱుచుచువచ్చిరి. నాపక్షమునఁ గొందఱు మిత్రులున్నను వారప్పుడు నాకుఁ జేయఁగలిగినసాయ మత్యల్పమయియుండెను. మొదటినుండియు నాకత్యంత ప్రోత్సాహకులుగా నుండి నన్నీ కార్యమునందుఁ ప్రవేశపెట్టి పురికొల్పుచున్న బాపయ్యపంతులుగారు మాత్రము సంస్కృతమునఁ గొంత