పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

135

లో నే నెంత యభిలషించుచుండినను, స్త్రీ పునర్వివాహములు వ్యాపించుటకుఁ దగినకాల మింకను రాలేదని తలఁచి యుండుటచేత నింతటిగొప్పమార్పున కయి కృషి చేయుటకు నాకు సాహసము పుట్టలేదు. ఇట్లు కొంతకాలము నడవఁగా నొకనాఁడు నాసహపాఠియు దేశాభిమానియు నాప్రియమిత్రుఁడు నైన చల్లపల్లి బాపయ్య పంతులుగారు మనము స్త్రీ పునర్వివాహము విషయము కృషిచేయవలెనని నాతో నత్యంతాసక్తితోఁజెప్పెను. నాయశక్తతను విచారించి నావంటివాఁడిట్టి మహాకార్యము తల పెట్టిన ప్రయోజనము లేదని యధైర్యముతోఁచి, నేనాయన నంతగాఁ బ్రోత్సాహపఱుపక చూతమని చెప్పి యు పేక్షింపఁ జొచ్చితిని. ఆయన రెండుమూడు తడవలు మరలమరల నాతో నీవిషయమయి మాటాడి, ఒకసారి వైదికులను గొందఱను దనవెంటఁ గొనివచ్చి యీకార్యమునిమిత్తము ప్రయత్నము చేయఁ దగినకాలము వచ్చినదని వారిచేతఁ జెప్పించి, ప్రోత్సాహకరములయినమాటలు చెప్పి నన్నుఁ బురికొల్పుచుండెను. ఇట్లు రెండుసారులు ప్రస్తావము జరగిన మీఁదట మూడవసారి నామిత్రునివంకఁ జూచి "నిన్ను మీయన్నలు విడిచి పెట్టినను బంధువులు బాధపెట్టినను నన్ను విడువక కడవఱకును నాతో నుండి పనిచేసెదవా ?" అని ధీరవృత్తితో నడిగితిని. అతఁడణుమాత్రమును సంశయింపక "ఎన్ని కష్టములువచ్చినను తొలఁగక నిలిచి పనిచేసెదను" అని తత్క్షణమే యుత్తరముచెప్పెను. అప్పుడిది యీశ్వరప్రేరితమైన యాజ్ఞయని నామనస్సునకు పొడకట్టఁగా, ఇఁక నేను వేఱుమాటాడక "సభాహ్వాన పత్రికను వ్రాసితెమ్ము. నేను వ్రాలుచేసి ప్రకటించెదను" అని చెప్పిపంపితిని. అతఁ డాహ్వానపత్రికను వ్రాసితీసికొనిరాఁగానే దానిమీద సంతకము చేసి పట్టణములోని వారికందఱికిని బంపితిని. విశేషపాండిత్యమును విత్తమును లౌకికాధికారమును లేనివాఁడను దుర్బలశరీరుఁడను నగునే నీమహాకార్యమును నిర్వహింపఁ గలుగుదునని నేనిందులో నడుగిడలేదు. ఇది యీశ్వర ప్రేరితమును నీశ్వరప్రీతికరమును నందుచే నాకుఁ బరమధర్మమును నన్న దృఢవిశ్వా