పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము.

3

యొద్ద దివానుగా నుండిరి. మాపూర్వులు సహితము సంస్థానాధిపతులును "దేశపాండ్యా"లును నయి పెక్కు కావ్యములను ముఖ్యముగా శైవగ్రంధములను గృతుల నందినవారయి యుండిరి. స్వయోగ్యత లేకయే పూర్వుల గొప్పతనమును బట్టి తమకు గౌరవము కలుగ వలయునని భావించెడు మనీషికోటిలోనివాఁడను గాకపోవుటచేత వారియుత్కృష్టతను వర్ణించుటకు నే నిందుఁబ్రయత్నింపను. మాతాతగా రగు వీరేశలింగముగారు మిగుల ధర్మాత్ములనియు, భూదానాదులు చేసి కీర్తివడసినవారనియు, చెప్పుట మాత్ర మిప్పటి కథాంశమునకుఁ జాలియుండును. అయినను నాబుద్ధిచాపల మేమోకాని మాతాతగారి ఖ్యాతినిగూర్చి స్వానుభవమువలన నే నెఱిఁగిన యొకచిన్న యంశము నిచ్చట సంక్షేపరూపమున నైనను జెప్ప మానఁజాలకున్నాను. ఇరువదియైదుసంవత్సరముల ప్రాయమప్పుడు నేను ధవళేశ్వరములో నాంగ్లోదేశభాషాపాఠశాలకుఁ బ్రధానోపాధ్యాయుఁడనుగా నుండి మండు వేసవికాలములో నాసహపాఠియు బాల్యసఖుఁడును నగు నొక మిత్రునిఁ జూచుటకయి కాకినాడకుఁ బోయి యచ్చటినుండి పడవలో నెక్కి మరల వచ్చు చుంటిని. అప్పుడు కాకినాడకాలువలోఁ దగినంతనీరులేదు. పడవవాడ్రెంతో ప్రయాసపడి మోకాలిలోఁతు నీటిలో పడవ నీడ్చుచుండిరి. ఇట్లు పడవ మెల్లఁగా నొకగ్రామసమీపమునకు వచ్చునప్పటికి మిట్టమధ్యాహ్న మయ్యెను; దుస్సహమయిన యెండవేఁడిమిచేత నిప్పులు చెరుగుచు వడగాడ్పులు వెచ్చగా నొకచెవినుండి యొక చెవికిఁ గొట్టుచుండెను; తీక్ష్ణతపతాపముచేతఁ బడవలోనున్నవారికి తడియాఱి నోళ్ళెండుచుండెను. ఆఁకలికిఁ దాళఁజాలక మలమలమాడుచు శిశువులు విలపింపఁజొచ్చిరి; సాయంకాల మగునప్పటికిఁగాని, పడవ ధవళేశ్వరము చేరునట్టు కనఁబడలేదు. ఇట్టిస్థితిలోఁ బడవవాండ్రను బతిమాలుకోఁగా వాండ్రు గ్రామములోనికిఁ బోయి భొజనము చేసి వచ్చువఱకును పడవ నక్కడ కట్టిపెట్టి యుంచుట కొప్పుకొనిరి. మా వారు నన్ను గారాబముతోఁ బెంచి మొదటినుండియు పని చేయనీయకుండుటచే వ్యర్థుఁడనైనవాఁడ నగుటచేత వంట చేసికొనుట యైనను నాకుఁ జేత