పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

స్వీయ చరిత్రము.

నాయం దట్టినిర్హేతుకప్రేమను బూనిరని యెందుచేతనో నాకప్పు డొకదురూహతోఁచెను. ఆపని నంగీకరించినపక్షమున నే నెట్టివారిక్రింద కొలువు చేయవలెనో నేనెఱుఁగుదును. మాపాఠశాలయందుఁ బరీక్షాసిద్ధులయి నూ నూగుమీసములతోను శృంగారతిలకములతోను జాఱుగోఁచులు గలచలువవలువలతోను స్వచ్ఛందవృత్తిని విహరింపమరగినవిద్యార్థు లట్టికొలువులలోఁ బ్రవేశించినయల్పకాలములోనే మీసములు గొఱిగించుకొని ముఖమున విభూతిరేఖలు దీర్చి బిళ్లగోచులుపెట్టి నీరుకావిదోవతులు కట్టుకొని యానవాలు పట్టరానిమాఱువేషములతో చరించుచుండుట నేను దినదినమును జూచుచుండెడివాఁడను. ధనాశచే నట్టిపని కొడబడినయెడల వారి యవస్థయే నాకును బట్టునని భయపడి నాహితులు చెప్పినబుద్ధి వినక యాపని నిరాకరించితిని. అప్పుడు కృష్ణామండలములో నుండిన చల్లపల్లి రంగయ్య పంతులుగారును గంజాముమండలములో నుండిన దివాన్ బహదూర్ వల్లూరి జగన్నాథరావు పంతులుగారునుకూడ నిర్వ్యాజమైన సదుద్దేశముతోడనే నా కాశాఖలో మంచిపనులు చెప్పించి నన్నున్నతదశకుఁ దేఁ జూచిరిగాని నేను మొదటినుండియు నధికారమునందును ధనార్జనమునందును విశేషకాంక్ష గలవాఁడను గాకపోవుటచేత నే నావిషయమున నంతగా నాదరమును జూపలేదు.

ఆకాలమునందు జరగిన యొక ముఖ్యాంశమునుమాత్రము సంక్షేపించి చెప్పి యీప్రకరణమును ముగించుచున్నాను. నేనును నామిత్రులు కొందఱును గూడి యప్పుడప్పుడు భగవత్ప్రార్థనలు చేసికొనుచుండెడివారము గాని యావఱకు రాజమహేంద్రవరములో వారవారమును మానసికముగా ఈశ్వరోపాసనముచేయు సమాజము లేకుండెను. అట్టిసమాజము నొకదానిని స్థాపింప వలసినదని నామిత్రులయిన బుర్రా రాజలింగముగారు నన్న డిగిరి. ముఖ్యముగా ఆయన ప్రార్థనముమీఁదనే ప్రార్థనసమాజమును 1878 వ సంవత్సరములో మొదట మాగృహమున స్థాపించితిమి. అప్పుడు నేనును, బుర్రా రాజలింగము గారును, బసవరాజు గవర్రాజుగారును, ఏలూరి లక్ష్మీనరసింహముగారును,