పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

123

గాన, కొందఱితో విరోధపడి యైనను జనసంఘమునకు మేలుచేయఁ గలిగితిమి గదా యని యానందించుచున్నాము." - దూరమున నున్న రాజధానీపరిపాలకులను రాజప్రతినిధిని హిందూదేశరాజ్యకార్యదర్శినిని తుదకు మహారాజచక్రవర్తిని తప్పు లెన్ని దూషించుట నిరపాయకర మయినపనిగాని తాను వసించు తావున నుండు ననుగతదండవిధాయిపైని గాని యారక్షకభటునిపైని గాని తప్పెన్ని వ్రాయుట యనపాయకర మయిన పనికాదు. అయినను తప్పు చేసినప్పు డనుగతదండవిధాయినిగాని మండలదండవిధాయిని గాని యారక్షకభటాధ్యక్షునిగాని ధర్మాధికారినిగాని మఱి యే యధికారినిగాని ఖండింపక మావివేకవర్ధని విడిచిపెట్టి యూరకుండలేదు. వివేకవర్ధనియొక్క యాక్షేపములకుఁ బాత్రులైన యధికారు లనేకు లనేకవిధముల దానిని రూపు మాపుట కయి ప్రారంభదశలోఁ బ్రయత్నములు చేసిరి గాని వారికృషి సఫలము కాలేదు. చిత్రపు కామరాజుగారి వ్యవహారమువంటి వ్యవహారములలో మహాప్రబలు లయినయధికారులే పరాభవము నొందవలసినవా రయినమీఁదట వివేకవర్ధనిపేరే భయంకర మయి దుష్టాధికారులకు గర్భనిర్భేదక మయ్యెను. అటు తరువాత దండవిధిచేత వివేకవర్ధనిని భంజింప విజృంభించినవారు కానరాలేదు. దండోపాయముచేత వివేకవర్ధనిని నిగ్రహించుట యసాధ్యమని తోఁచినతరువాత కొందఱు బుద్ధిమంతులు సామోపాయముచేత దానిని సాధింపఁ జూచిరి. నా కప్పుడు రాజమహేంద్రవర రాజకీయశాస్త్రపాఠశాలలో నెల కిరువది యైదురూపాయల జీతము. ఆరంభములోనే నెల కిరువదియైదురూపాయల పనిని కరగ్రాహికార్యస్థానములో నిచ్చునట్లు నేను కోరకయే నా కొకవాగ్దానము వచ్చెను. విమోహకరమైనయాపని నప్పు డంగీకరించియుండినయెడల నే నొకవేళ గొప్ప లౌక్యాధికారిపదము నొందియుందు నేమోకాని నాస్వతంత్రభావమును పారమార్థికచింతను మనశ్శాంతిని తప్పక కోలుపోయి యుందును. నా కప్పు డుపకారము చేయఁ బూనినవారు సచ్చింతతోనే చేసి యుండవచ్చునుగాని, వారు వివేకవర్ధని నడఁచి వేయవలెనను తలంపుతోనే