పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

స్వీయ చరిత్రము.

మున కారోపింపఁ దొడఁగిరి. నే నవలంబించినపక్షము న్యాయపక్ష, మనియు నీశ్వరప్రీతికర మనియు నాదృఢనిశ్చయ మయినందున నామనశ్శాంతి కెప్పుడును భంగము కలుగ లేదు. ఇట్టిచిక్కులలోఁ జిక్కుకొని యున్న కాలములోనే సెప్టెంబరు నెల 8 వ తేదిని మేము మొట్టమొదట రాజమహేంద్రవరమున సంఘసంస్కారసమాజమును స్థాపించి పని చేయ నారంభించితిమి. ఆసమాజములో మొదట నుపన్యాసము లియ్యవలసినభారము నామీఁదనే పడెను. ప్రథమోపన్యాససమయమునకు నాప్రియమాతకు వ్యాధి ప్రబలి ప్రాణముమీఁదికి వచ్చినందున నే నాయుపన్యాసమును కడవఱకును వ్రాయలేక కొంత వాగ్రూపముననే చెప్పవలసినవాఁడ నైతిని. 1878 వ సంవత్సరము సెప్టెంబరు నెల 22 వ తేదిని నాపాలనే పడిన రెండవయుపన్యాసము నియ్య వలసినవంతు వచ్చునప్పటికి నన్నుఁ బెంచి పెద్దవానిని జేసి విద్యాబుద్ధులు చెప్పించి సమస్తవిధములఁ బ్రాణపదముగాఁ గాపాడిన ప్రాణాదికురా లయిన నాప్రియజనని నన్ను విడనాడి లోకాంతరగతు రాలయి నన్ను దుఃఖసముద్రములో ముంచిపోయినది. ఆమెయుత్తరక్రియలు ముగిసినతోడనే యాదుఃఖములోనే నేను రొజారియోగారివ్యవహారములో సాక్ష్య మిచ్చుటకు బందరుపురమునకుఁ బోవలసినవాఁడ నైతిని. దుర్న యపరులదుర్య్వాపారములను మాన్పుట కయి ప్రయత్నించుటచే నా కెందఱితోనో వైరములు సంభవించెను గాని యాయల్పాంశము లన్నియు నిచ్చట వివరింపవలసినవి కావు. 1878 వ సంవత్స రాంతమునఁ బ్రకటింపఁబడిన వివేకవర్ధనిలో నిట్లు వ్రాయఁగలిగితిని - "మే మీపనిని (పత్రికాప్రకటనమును) పూనుకొనుట దేశముయొక్కయు ప్రజలయొక్కయు క్షేమలాభములకొఱకేకాని ధనలాభమున కాశపడి కాదు. లౌక్యాథికారధూర్వాహు లయి యున్న కొందఱిదుశ్చేష్టలను వెల్ల డి చేయుట వలన, అట్టివారు మాకు శత్రువులుగా నేర్పడిరి. అయినను ఒకరి యనుగ్రహమున కపేక్షపడిగాని, ఒకరినిగ్రహమునకు వెఱచిగాని పత్రికావిలేఖకత్వము ననుసరించి మాకు విధిగా నేర్పడినకృత్యమునుండి తొలగకుండుట మాపూనిక