పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

121

మాయింటికి వచ్చి నన్ను లేపి తన్మరణవార్తను దెలిపినప్పుడు నా కతివిస్మయమును విచారమును గలిగినవి. మండలన్యాయాధిపతిగారు రొజారియో గారిని బొల్లాప్రగడ వెంకన్న గారినికూడ పనిలోనుండి తొలఁగింపఁగా, వారున్నత న్యాయసభవారికిని దొరతనమువారికిని విజ్ఞాపనపత్రములను బంపుకొనిరి గాని వానివలనఁ గార్యము లేకపోయెను. సిరస్తాదారుగానుండిన రొజారియోగా రన్న వస్త్రములకు లేక బాధపడుచు యాచించుటకయి నా యొద్దకు సహితము వచ్చుచుండెడి వాఁడు. అల్పకాలములోనే యతఁడు మతి చాంచల్యము నొంది కడపట పిచ్చివాండ్ర వైద్యశాలలో దుర్మరణము నొందెను. ఉన్నతన్యాయసభవారు పోలూరి శ్రీరాములుగారినికూడ లంచములు పుచ్చుకొన్నందునకు విమర్శ చేయవలసినదని మండలన్యాయాధిపతి కుత్తరు వియ్యఁగా, విమర్శమధ్యముననే యాకస్మికముగా నతఁడును దేహవియోగము నొంది యిహలోకదండనమును తప్పించుకొనెను. ఆయన మరణమునకును గారణ మాత్మహత్యయే యని జను లప్పు డనుకొనుచు వచ్చిరి. ఆయన లంచములమూలమున సంపాదించిన ధన మంతయు నీవ్యవహారములో వ్యయపడుటయేకాక మునుపున్నదికూడ పోయెనఁట. ఈశ్వరబలముముందఱను సత్యబలముముందఱను మనుష్యబలమును ధనబలమును గవ్వకును కొఱగావు. ఈశ్వరబల మున్నపక్షమున పూరిపుడకయు వజ్రాయుధ మగును; ఈశ్వరబలము లేనిచో వజ్రాయుధము సహితము పూరిపుడక యగును. ఈశ్వరబలమును సత్యబలమును ధర్మబలమును గలిగియుండఁబట్టియేకదా యెందునకును బనికిరానిదని పెంటలో పాఱవేయఁబడిన చింపిరికాగితపుముక్క లుత్తమసాధనములయి సాక్ష్యమిచ్చి యిందఱిప్రాణములను మానములను ధనమును జీవనమును గొనఁగలిగినవి ! లోకములో సత్యబలమును ధర్మబలము నే బలములు గాని యవి లేని యధికారబలమును విత్తబలమును బలములు కావు.

ఆకాలమునందు శరీరప్రయాసముగాక నాకును గొన్ని కష్టములు వచ్చినవి. మూఢజనులు వానిని గొప్పవారితో వైరము పెట్టుకొన్న నాయవివేక