పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

స్వీయ చరిత్రము.

లోనికాగితమును పైకిఁదీసి దొరగారిచేతి కిచ్చితిని. దొరతనమువారిన్యాయ వాది యగుటచేత కామరాజుగారివ్రాఁత యందఱకుఁ దెలిసినదిగా నుండెను. నే నిచ్చినచిత్తుకాగితములో హంసపాదములు తుడుపులు ననేకములున్నవి. వ్యాజ్యెపుగ్రంథములోనితీర్పు సరిగా దానికి శుద్ధప్రతిగా నున్నది. ఆరెంటిని జూడఁగానే దొరగారికి మునుపున్న యభిప్రాయమంతయు నొక్కసారిగా మాఱిపోయినది. ఆయన యాచిత్తుతీర్పునుదీసి కామరాజుగారిచేతి కిచ్చి యిది నీవ్రాఁతయగునా కాదా యని యడిగెను. ఆకస్మికముగాఁ జూపఁబడుటచే నాలోచించుకొనుట కవకాశములేక చేతులు వడఁక గద్గదస్వరముతో "నా వ్రాఁతవలెనే యున్నది" అని యాయన బదులు చెప్పెను. "ఇది తప్పక నీ వ్రాఁతయే. సత్యము నా కిప్పుడు బోధపడినది. (నన్నుఁజూపి) ఇతఁడు న్యాయస్థుఁడు. సిస్తాదారును మీరును గలిసి యీతనిపై నాకు దురభిప్రాయమును గలిగించితిరి. ఈవఱకు పోయిన ముక్కలన్నియు నిజమైనవే. ఆ ముక్కలను సిరస్తారునకు లంచమిచ్చి మార్పించినవాఁడవునీవే. విమర్శనిమిత్తము ఱేపటిదినము నిన్ను దండవిధాయి యొద్దకుఁ బంపెదను. అని కోపముతోఁ బలికి, మామండలన్యాయాధిపతిగారు కాగితమును కలమును గై కొని సిరస్తాదారును క్రిమినల్ రికార్డు కీపరును పనిలోనుండి తొలఁగించినట్టు వ్రాసి చదివి వినిపించెను. నాటికి సభముగిసినది. నవ్వుమొగములతో సభనుప్రవేశించిన మాప్రతిపక్షులు తొంటియుత్సాహమును గోలుపోయి యేడుపు మొగములతో సభను విడిచిరి. సత్యము తెలిసినతరువాత సహితము తమపూర్వాభిప్రాయమును మార్చుకోనొల్లని మనవారిలో ననేకులవలెఁ గాక యూరపియనులు సాధారణముగా తాము పడినయభిప్రాయము తప్పని తెలియఁగానే దానిని మార్చుకొందురు. కామరాజుగారు సభనుండి యింటికిఁ బోయి తా మవమానము నుండి తప్పించుకొనుట కిఁక మార్గములేదని విచారించి తనసొత్తువిషమయి మరణశాసనమును వ్రాసి ముగించి యారాత్రియే విషముత్రాగి యాత్మ హత్యచేసికొనిరి. నాఁడు తెల్లవారుజామున నాలుగుగంటలకు గవర్రాజు గారు