పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

119

నమ్మకము కలిగి యుండెను. నాయొద్దనుండిన తీర్పులముక్క లన్నియు పరుల పాలయి భగ్నములైపోయినవి; వాని నన్యాక్రాంతము చేసిన సిరస్తాదారుగారు మండలసభలో నిర్దోషులుగా నెన్నఁబడి విమిక్తులయిరి; విచారణకుఁ బూనిన మండలన్యాయాధిపతిగారు నాపైని సదభిప్రాయము లేనివారయి ప్రతి పక్షులపక్షము నవలంబించినవారుగా నుండిరి. ఇట్లు నిమిత్తములన్నియు పైకి నాకు ప్రతికూలముగాఁ గనఁబడుచుండినను కడపట సత్యము జయింపకపోదని మాత్రము ధైర్యముండెను. నాయొద్ద నింకొకతీర్పుముక్క మిగిలియున్నదని నామిత్రులకుఁ గాని యమిత్రులకుఁగాని తెలియదు. అన్ని ముక్క లట్లు విఫలములయి పోయినప్పుడు డీయొక్క ముక్కమాత్రము సఫలమగునని యూహించుట కంత యవకాశము లేకపోయినను, ఇల్లు వెడలునప్పుడు నే నాతీర్పుకాగితమును చొక్కాసంచిలో వేసికొనియే న్యాయసభకుఁ బోయితిని. మండలన్యాయాధిపతి గారు తమప్రక్క నే క్రింద నా కొక్కకుర్చీని వేయించి కూర్చుండ సెలవిచ్చిరి. విచారణయారంభమగుటకు ముందుగా నే నొకకాగితముమీఁద నావద్ద కామరాజుగారివ్రాతతో నున్న చిత్తుతీర్పింకొకటి యున్నదనియు, ఆవ్యాజ్యెపుగ్రంథమును వెంటనే తెప్పించెడిపక్షమున దాని సంఖ్యను దెలిపెదననియు, వ్రాసి న్యాయాధిపతిగారిచేతి కిచ్చితిని. సంఖ్య చెప్పవలసిన దని నావ్రాఁతక్రిందనే వ్రాసి యాయన యా కాగితమును నా చేతి కిచ్చెను. దానియడుగున సంఖ్యను వ్రాసి కాగితమును మరల నేను దొరగారి కిచ్చితిని. ఆయన తత్క్షణమే యొకయుత్తరపు కాగితమునందుకొని దాని పై నేమోవ్రాసి యాలేఖ నొక కాగితపుసంచిలోవేసి జిగురంటించి చెంత నున్న భటుని బిలిచి పరుగెత్తుకొనిపోయి నీ విది ప్రాడ్వివాకసభలోనిచ్చి వారిచ్చినది గొనిరమ్మని యాజ్ఞాపించెను. నాకును దొరగారికిని నడచినయుత్తర ప్రత్యుత్తరము లేవో యితరుల కెవ్వరికిని దెలియలేదు. ప్రాడ్వివాకసభ యా యావరణములోనే యుండినందున పోయినభటుఁ డరగంటలోపలనే యా వ్యాజ్యపుగ్రంథమును గొనివచ్చి దొరవారిచేతి కిచ్చెను. అప్పుడు నాజేబు