పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

117

అట్టివిచారణ యావశ్యకము లేదనియు, వస్తువులేవియు పోలేదనియు, ముక్కల దొంగతనమునుగూర్చి తనసిరస్తాదారువిషయమయి సందేహపడుట కవకాశము లేశము లేదనియునతఁడు బదులువ్రాసెను. అందుపైని మండలారక్షకాధ్యక్షుఁడు జరగిన సంగతి యంతయు నా చేత వ్రాయించి పుచ్చుకొని నామిత్రుల నొకరిద్దఱినిగూడ విచారించి తాను వెంటనే కాకినాడకుఁ బోయి మండలదండవిధాయితో నడచినకథయంతయు విన్న వించి, సిరస్తాదారుని క్రిమినల్ రికార్డు కీపరును పట్టుకొనుట కయి యాయనయొద్దనుండి యధికారపత్రములను (Warrants) గొనివచ్చెను. ఆమఱునాఁడు రొజారియోదొరవారును బొల్లా ప్రగడ వెంకన్న గారును భోజనములు చేసి న్యాయస్థానమునకుఁ బోవునిమిత్తము బట్టలు కట్టుకొనుచున్న సమయములో నారక్షకభటులు వారియిండ్లకుఁ బోయి వారినిరువురను బట్టుకొని యారక్షకస్థానమునకుఁ గొనిపోయి కొట్లలోఁ బెట్టిరి. ఈసంగతి తెలియఁగానే యూరంతయు నల్లకల్లోలమయ్యెను. ఎల్లవారును పురమున నెక్కడఁ జూచినను ఈవిషయము నే ముచ్చటించుచుండిరి. ప్రతిపక్షులపక్షమువారు తోడనే పరుగెత్తుకొనిపోయి యావై పరీత్యమును మండలన్యాయాధిపతిగారితో మనవిచేసిరి. ఆయన యద్భుతపడి సిరస్తాదారుని వెంటనే విడిచి పెట్టవలసినదనియు, అతఁడు నిర్దోషియనియు, అతఁడు లేకపోవుటచేత న్యాయస్థానకార్యముల కడ్డంకి కలుగుచున్నదనియు, ఆరక్షకాధ్యక్షునిపేర లేఖవ్రాసెను. ఆరక్షకశాఖవారు దానిని మన్నింపక యా సాయంకాలమే వారినిరువురను పడవ యెక్కించి కాకినాడ మండలదండ విధాయియొద్దకుఁ దీసికొనిపోయిరి. సాక్ష్యమిచ్చుటకు మేమును వారితోడనే పోయితిమి. మండలదండవిధాయిగారు ప్రథమవిచారణచేసి మావలన సాక్ష్యములను గైకొని, రాజమహేంద్రవరమునకు వచ్చి చౌర్యము జరిగినస్థలమును జూచి, మండలన్యాయాధిపతిగారివలన వాగ్మూలమును గైకొని, బొల్లాప్రగడ వెంకన్న గారిని విడిచిపెట్టి సిరస్తాదారుగారినిమాత్ర మంతిమవిచారణనిమిత్తము మండలదండాధికారికార్యస్థానమునకుఁ బంపిరి. మామండలదండాధికారియు