పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వీయ చరిత్రము

మొదటిప్రకరణము - బాల్యదశ.

క్రీస్తుశకము 1848 మొదలుకొని 1860 - వ సంవత్సరమువఱకు.

భరతఖండమునందలి పురాతనము లయినపట్టణములలో నొక్కటియయి, రాజరాజనరేంద్రాది చాళుక్యచక్రవర్తులకు రాజధాని యయి, ఆంధ్రకవితా కల్పలత కాలవాలమయి, నన్నయభట్టారకాది కవిగ్రామణులకు వాసభూమి యయి, గోదావరీతీరమునందు సర్వవిధములఁ బ్రసిద్ధి కెక్కియున్న రాజమమహేంద్రవరము నందలి యస్మత్పితామహార్జితమైన స్వగృహమునందు కీలక నామసంవత్సర చైత్రశుద్ధత్రయోదశీ భానువారమునాడు (అనఁగా క్రీస్తుశకము 1848 వ సంవత్సరము ఏప్రిల్ నెల 16 వ తేదిని) సూర్యోదయానంతరమున మూడుగడియలకు నేను జననమొందితిని. మాయిల్లు రాజమహేంద్రవరములో నున్న పెద్దయిండ్లలో నొకటి. దానితో సమాన మయిన యిండ్లాపట్టణములో రెంటిమూటికంటె నధికముగా లేకుండెను. నా పెదతండ్రిగారును నేనును సమభాగములుగాఁ బంచుకొన్నను, నాపాలికి వచ్చిన యర్థభాగమే రాజమహేంద్రవరములోని బహుగృహములకంటె మిక్కిలి పెద్దదిగానున్నది. నేను జన్మించినగది నాపాలికి వచ్చిన మేడయింటిలోనే యుండి నాయధీనములోనే యున్నది. ఆగదికిని మాగృహములోని యొక చావడికిని నడుమఁ గల గోడను దీసివేసి యేకముగా నొక విశాల భోజనశాలనుగా మార్చి మే మిప్పుడు దానిని భోజనగృహముగా వాడుకొనుచున్నాము. నారాజ శేఖరచరిత్రము నందలి రాజశేఖరుఁడు గారి గృహవర్ణన మించుమించుగా మా గృహవర్ణనమే. పూర్వార్జితమైన యంత విశాలభవనమును గలిగియుండుటయే కొంతవఱకు మాపూర్వు లున్నతస్థితిలో నున్న వారని తెలుప వచ్చును. ఆ గృహరాజమును గట్టించినమాతాతగారు మహాసుప్రసిద్ధులయి కొంతకాలము సంస్థానాధిపతుల