పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

స్వీయ చరిత్రము.

వలంబులును నయమున భయమున బుజ్జగించియు బెదరించియు మిర్తిపాటి రామయ్యగారినే వశ్యుని జేసికొని తమపక్షమునకుఁ ద్రిప్పుకోవలెనని కృషి చేసిరికాని సఫలమనోరథులు కాలేకపోయిరి. "బలవంతులతో నేల విరోధ పడియెదవు ? ఈపనివలన నీకు వచ్చెడులాభమేమి !" అని యడిగెడివారితో నెల్ల నతఁడు తా నావఱకుఁ బొందిన యుపదేశానుసారముగా ప్రజా క్షేమము (Public good) కొఱకని చెప్పుచు వచ్చెను. అందుచేత జను లతనిని గొంతకాలము "పబ్లీక్‌గుడ్డుగాఁ" డను వినోదనామముతో కోడిగములకుఁ బిలుచుచుండిరి. ముక్కలు దొంగలెత్తుకొనిపోయిరని చెప్పుటకయి మొట్ట మొదట రాత్రివేళ తలుపుతెఱచి కాగితములను తాఱుమాఱుగా పాఱవైచినను, కాగితములనిమిత్తమే దొంగలు పడిరన్నచో నేరము చిత్రపుకామరాజు గారిమీఁదనో మునసబుగారిమీఁదనో సిరస్తాదారుగారిమీఁదనో మోపఁబడునని భయపడి వారు తరువాత ముక్కలు పోలేదని పలుకుచు చిత్రపు కామరాజుగారి వ్రాఁతలో నున్న పనికిమాలినముక్కలను దెప్పించి గదిలోఁ గూరుచుండి రహస్యముగా వానిని పూర్వపుముక్కలను మాఱుగా నొకకాగితపు సంచిలోవేసి ముద్రవేసిరి. ముక్కలుపోలేదని సిరస్తాదారుగారు కడపట మండలన్యాయాధిపతిగారిముందు పెట్టి చూపినవి యీక్రొత్తముక్కలే. ఈ ప్రకారముగా ముక్కలుపోయినను వ్యవహార మంతటితో పోలేదు.

రాజమహేంద్రపురారక్షక పర్య వేక్షుఁడు (Police Inspector) ఈన్యాయమునువిని విచారపడి నన్ను మండలారక్షకాధ్యక్షుని (District Police Superintendent) కడకుఁ గొనిపోయి మాటాడెను. ఆరక్షకాధ్యక్షుఁడు జరిగినదంతయువిని మనసు కరఁగినవాఁడయి యీ వ్యవహారములో తనచేతనైన పనియంతయుఁ జేసెదనని చెప్పి, న్యాయసభలో జరగిన చౌర్య విషయమయి విచారణ జరపుటకు సెలవియ్యవలసినదనియు, పోయినముక్కల విషయమయి సిరస్తాదారునియొక్క యాలోచనమీఁదనే యీపని జరగినట్టనుమానింపఁ దగియున్నదనియు మండలన్యాయాధిపతి కుత్తరమువ్రాసెను.