పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

స్వీయ చరిత్రము.

విమర్శదినము రాకమునుపే యేలాగుననోకాని మండలన్యాయాధిపతి గారి పెట్టెలోని తీర్పులముక్కలు సిరస్తాదారుగారిచేతిలోనికి వెళ్ళినవి. అత్యంత సమర్థుఁడును పరమతాంత్రికుఁడును మాయోపాయవిశారదుఁడు నైన చిత్రపు కామరాజుగా రాముక్కల నేలాగుననైన నపహరింపవలెనని సర్వవిధములఁ బ్రయత్నించుచుండిరి. అప్పుడు మండలన్యాయసభలో సిరస్తాదారుగా నుండిన రొజారియోదొరగారివద్ద లంచములవ్యవహారములలో దండశాఖాలేఖ్యరక్షకుఁడైన (Criminal Record-Keeper) బొల్లాప్రగడ వెంకన్న గారు మంత్రిగా నుండిరి. ఈమంత్రిమణిగారు నూఱురూపాయలు లంచము మాటాడినప్పుడు పాతికరూపాయలతోనే సిరస్తాదారుని తృప్తిపఱిచి తక్కిన ముప్పాతికరూపాయలను తనకష్టమునకై తానే స్వీకరించుచుండెడి శక్తియుక్తులు గలవాఁడని వాడుక. అనుదినమును సూర్యనమస్కారములు చేయుచు నిష్ఠాపరుఁడయి యుండెడి యీమంత్రిశిఖామణికి మున్నూఱురూపాయ లిచ్చి చిత్రపు కామరాజుగారు తీర్పులముక్కలను తీసివేయించుట కేర్పాటు చేసిరఁట. ఈమొత్తములో నిరువదియైదురూపాయలును రెండుసారాబుడ్లును దక్క సిరస్తాదారుగారికి మఱేమియు దక్కలేదఁట. న్యాయసభలో మండలన్యాయాధిపతిగారిసమక్షమునఁ బ్రదర్శింపఁబడినముక్కలను దీసివేయుట యెట్లా యని గొప్పవిచారముపుట్టినది. ముక్కలను దొంగ లెత్తుకొనిపోయినట్టు కనఁబఱుపవలెనని వారు మొట్టమొదట నాలోచించి సరి యనుకొనిరి. ఆయాలోచననుబట్టి తెల్లవాఱి విమర్శ యారంభ మగు ననఁగా 25 వ తేది రాత్రి న్యాయసభాభవనముయొక్క గోదావరివైపున నున్న తలు పొకటి తెఱవఁబడి, సిరస్తాదారునియొక్కయు నొక లేఖకునియొక్కయు వ్రాఁత పెట్టెలు పగులఁగొట్టఁబడి, కాగితములు చిందరవందఱగా నేలమీఁద చిమ్మివేయఁబడినవి. సొమ్ము పెట్టెసమీపముననే యున్నను దాని నెవ్వరును ముట్టుకోనేలేదు. కామరాజుగారి వ్యవహారముతో సంబంధించిన కాగితములను న్యాయసభాభవనములో దొంగలుపడి యెత్తుకొనిపోయిరని పట్టణమున గొప్ప