పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

113

యింటిదారిని బోవుచు వీధిలోనిలువఁబడియున్న నాతో మాటాడుటలో మునసబుగారును కామరాజుగారును నాగరాజుగారియింటి కేదోపనిమీఁదదన్నుఁ బంపినట్లు పొరపాటునఁ గొన్నిమాటలు జాఱవిడిచెను. నేనాయనను బంపివేసి వెంటనే నాగరాజుగారియింటికిఁబోయి యాముక్కలబుట్టను దీసికొనివచ్చి నాపెట్టెలోఁబెట్టి తాళము వేసితిని. ముక్కలనిచ్చినచోఁదనకేనూఱుపాయ లిచ్చెదమని సందేశము పంపిరనియుఁదాను నిరాకరించితిననియు నాగరాజు గారు తరువాతనాతోఁ జెప్పిరి. అటుపిమ్మట రెండుమూడుదినములలో నాకు మొదటముక్కలను దెచ్చియిచ్చినన్యాయవాది మాయింటికివచ్చి తనకాదినమున న్యాయసభలో పనిలేదనియు బుట్టతీసికొనిపోయి తీర్పుల నతికించెద ననియుఁజెప్పెను. నే నామాటనమ్మి ముక్కలబుట్ట నిచ్చివేసితిని. కామరాజుగారేదో మాయోపాయము పన్ని ముక్కలబుట్ట నపహరించిరని నాటిసాయంకాలమే పట్టణములో నొకప్రవాదము కలిగెను. కామరాజుగారు ధనకాములయినవారికి ధనమిచ్చియు స్త్రీ కాములయినవారికి స్త్రీలను సంధించియు వివిధమాయోపాయములచేత స్వకార్యమును సాధించుకొనెడు పరమ సామర్థ్యముగలవారు. ముక్కలబుట్ట ప్రతిపక్షులను జేరిన దన్న వార్తనాచెవిని బడఁగానే నేనాన్యాయవాదికడకుఁబోయి యడుగఁగానతాఁడాబుట్టలో పనికి వచ్చుముక్కు లేవియు లేనందున వానిని కాల్చి వేసితినని చెప్పెను. అంతటితో నన్ని ముక్కలును పోయినవని యెల్లవారును దలఁచియుండిరేగాని నా యొద్ద నింకొక్కతీర్పు మిగిలియున్నదని నామిత్రులు సహిత మెఱుగరు. కామరాజుగారు గూఢాచారులనుబెట్టి నేనెక్కడెక్కడకుఁ బోవుచుందునో యెవ్వరెవ్వరితో మాటాడుచుందునో యేమేమిపనిచేయుచుందునో నావర్తనము సర్వమును గనిపెట్టుచుండెడివారు.

మిర్తిపాటి రామయ్యగారి విన్నపముపైని మండలన్యాయాధిపతిగారు విమర్శకు జూన్ నెల 26 వ తేది నిర్ణయించి, సాక్షులకాహ్వానములు పంపి, ఆయావ్యాజ్యెముల గ్రంధములు పంపుమని ప్రాడ్వివాకున కుత్తరువు చేసిరి.