పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

స్వీయ చరిత్రము.

న్యాయసభలో నొకవిన్నపము పెట్టించితిమి. ఇంతలో కామరాజుగా రా మహమ్మదీయునిచేత తనవిన్నపములోనిసంగతు లేవియుఁ దా నెఱుఁగననియు, ఒక న్యాయవాది (దామరాజు నాగరాజుగారు) మోసము చేసి తనచేత నందులో సంతకముచేయించెననియు, తనవిన్నపమును విమర్శింపనక్కఱలేదనియు, మఱియొక విన్నపమును బెట్టించెను. అందుపైని మండలన్యాయాధిపతి గారా న్యాయవాదిని మహమ్మదీయునిని బిలిపించి వారు చెప్పినసంగతులను వ్రాసికొనిరిగాని పిమ్మట నేమియుఁజేయక యూరకుండిరి. మిర్తిపాటి రామయ్యగారిచ్చిన విన్నపముపైని మామండలన్యాయాధిపతిగారు మహమ్మదీయునితీర్పు యొక్క సగముముక్కను బుచ్చుకొని, సాక్షులపేరులను తక్కిన యాధారములను ప్రదర్శింపవలసినదని యుత్తరువిచ్చిరి. నాయొద్ద నింకను తనవ్రాతఁతో నున్న ముక్కలున్నవని కనిపెట్టి నాయొద్దనున్న ముక్కలనన్నిటిని నిచ్చి వేసినపక్షమున నైదువేలరూపాయల నిచ్చెదమని చిత్రపు కామరాజు గారు నాకు సందేశమును బంపిరి. ఆసందేశము నప్పుడు నేను తిరస్కారభావముతో నిరాకరించితిని. ఇప్పటికైదుతీర్పులముక్కలను మేము పూర్ణముగా నతికింపఁ గలిగితిమి. అతికింపఁబడినవానిలో నొక్కతీర్పునుమాత్రము నాయొద్దనుంచుకొని తక్కిన నాలిగింటి ముక్కలను ఒక్క కాగితపుసంచిలోఁబెట్టి నా యుంగరముతోనే లక్కముద్రవేసి, మిర్తిపాటి రామయ్యగారిని నావెంట మండలన్యాయసభకుఁదీసికొనిపోయి, ఆముక్కలసంచిని విమర్శదినమువఱకును న్యాయాధిపతి సొంతపెట్టెలోనే యుంచుకొనునట్లు విన్నపము వ్రాయించి, వానిని దొరవారికిఁ బ్రదర్శింపించితిని. ఇంకను మేము క్రొత్తతీర్పుల నతికించుటకయి పాటుపడుచునే యుంటిమి. పనికిమాలినవని తీసివేసినముక్కలు పోఁగా నింకను బుట్టెడుముక్కలు నాయొద్దమిగిలియుండినవి. వానిలో నేవైన సరిగా నతుకునేమో చూచుటకయి యాబుట్టను నేను దామరాజు నాగరాజు గారియొద్దనుంచితిని. ఆమఱునాడుఁదయమున జాముప్రొద్దెక్కిన తరువాత నొకరెండవ తతగతిన్యాయవాది నాగరాజుగారి యింటి యొద్దినుండి మా