పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

111

పోయెను. ముక్కలు సంగ్రహించి తెచ్చినన్యాయవాది యతికించినవానిలో రెండుకాగితములు చేరి పూర్ణముగా నొకతీర్పయ్యెను. పడిన ప్రయాసము వ్యర్థమయిపోలేదని నా కప్పు డపరిమితసంతోషము కలిగినది. ఆవ్యాజ్యమును గోలుపోయినవాఁ డొకమహమ్మదీయుఁడు. నాసహపాఠియు రెండవతరగతి న్యాయవాదియునైన దామరాజు నాగరాజుగారిచేత నామహమ్మదీయునిఁ బిలిపించి మాటాడఁగా, అతఁడు కామరాజుగారు లంచ మిమ్మని తన్నడిగినప్పుడు బీదవాఁడగుటచేతఁ దానియ్య లేకపోయితిననియు ప్రతివాదియొద్ద లంచముపుచ్చుకొని మునసబు వానిపక్షమున తీర్పుచేసెననియు చెప్పెను. ఆ సంగతులనే తెలుపుచు మహమ్మదీయునిసమ్మతితో మండలన్యాయాధిపతిపేర విన్నపమొకటి వ్రాయించి దానిలోవానిచేతవ్రాలు చేయించి, చిత్తుతీర్పు యొక్క సగముభాగము నందుతోఁ జేర్చికుట్టించి మండలన్యాయసభలోఁ బెట్టించితిమి. నాగరాజుగారియొద్ద లేఖకుఁడుగానుండిన మిర్తిపాటి రామయ్యగా రావిన్నపములోఁ బేర్కొనఁబడిన సాక్షులలో నొకఁడు. ఈవిన్నపము సంగతి తెలియఁగానే మహాతాంత్రికుడైన కామరాజుగా రామహమ్మదీయుని రహస్యముగాఁ దనయింటికి రప్పించి, వానికి వాజ్యపు మొత్తమునకు ద్విగుణముగా ధనమిచ్చి వానియొద్దనున్న తీర్పుముక్కల నపహరించెను. అన్ని రూపాయలొక్కసారిగా చేతఁబడఁగానే యామహమ్మదీయుఁడు పట్టరాని సంతోషముతోఁ దనమిత్రులకు విందు చేసెను. ఈవిందువలన ముక్కలుపోయినట్టుమాకుఁ దెలిసినది. ఈలోపల మఱిమూడునాలుగుతీర్పుల ముక్కలనుగూడ మేమతికి పూర్తిచేసితిమి. ముక్కలు పోయినసంగతితెలియఁగానే సాక్షియైన మిర్తిపాటి రామయ్యగారిచేత మహమ్మదీయుఁడు చిత్రపుకామరాజుగారివద్దసొమ్ము పుచ్చుకొనితిరిగిపోయి ముక్కలిచ్చివేసెననియు, కామరాజుగారు మునసబుగారికి లంచములు కుదుర్చుచున్నట్టును దీర్పులువ్రాసియిచ్చు చున్నట్టును ఋజువు చేయుటకు తనయొద్ద నాధారము లున్నవనియు, మహమ్మదీయునితీర్పుయొక్క సగముముక్క తనయొద్దనున్నదనియు, మండల