పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

స్వీయ చరిత్రము.

కుండిరి. మంత్రాంగమును నడపెడిక్రిందియుద్యోగస్థులు ప్రాడ్వివాకు లగు పోలూరి శ్రీరాములు గారు కేవలధర్మమూర్తులనియు వారిపైని దోషారోపణము చేయు మాబోటు లీర్ష్యాపరు లగు నీతిమాలినదుష్టులనియు మామండల న్యాయాధిపతిగారికి దృఢఃవిశ్వాసము కలుగునట్లు చేసిరి. మండలన్యాయసభలోని యప్పటి రాజసేవకులలో పదిరూపాయల జీతముగల లేఖకుఁడైన బయపునేడి వేంకటజోగయ్యగా రొక్కరుమాత్రము నాకుమిత్రులయి నాపక్షమవలంబించి యుండిరి. ఆయనవలననే నాకప్పుడు న్యాయస్థానమునందు జరగు కుతంత్రములు కొన్ని యప్పుడప్పుడు తెలియుచుండెను. ఈవిధముగా నధికారబలమును మనుష్యబలమును మాప్రతిపక్షులపక్షముననే యున్నను సత్యబలమును దైవబలమునుమాత్రమే మాకు సహాయములయి యుత్సాహజనకములుగా నుండెను. దుర్బలపక్షమైన మాకపజయము తప్పక కలుగునని యెల్లవారును బ్రతీక్షించుచుండిన యాకాలములో నీశ్వరుఁడు మా కొక్కయాధారమును గనఁబఱిచెను. చిత్రపుకామరాజుగారు మునసబుగారినిమిత్తము వ్రాసినచిత్తుతీర్పు కాగితములను శుద్ధప్రతులు వ్రాయఁబడినతరువాత చించివేసి యాముక్కులను చింపివేయఁబడినయితరమైన కాగితపుముక్కలను గలిపి తమయింటి కెదురుగా నుండిన పాడుదొడ్డిలోని పెంటకుప్పలలోఁ బాఱవేయించు చుండిరి. అందులో తీర్పుముక్కలున్నవని మాకప్పుడు తెలియకపోయినను వారియింటి కెదుటింటిలోఁ గాపురమున్న యొకన్యాయవాది వచ్చి వారేవో కాగితపుముక్కలు పాఱవేయుచున్నారని నాతోఁజెప్పెను. అవియెందులకైనను బనికి రావచ్చునని తలఁచి వీధులు తుడుచుదాని కేమైననిచ్చి యాముక్క లెత్తించి తీసికొని రావలసినదని నే నాన్యాయవాదితోఁ జెప్పితిని. అతఁడట్లుచేయించి రెండుబుట్టలతో ముక్కలను మాయింటికడఁ జేర్చెను. ఆముక్క లే మైన నతికి చదువఁదగియుండునేమో యని యొకదానితోనొకటి చేర్చి ప్రయాసపడి యతికింపఁ జొచ్చితిని. శ్రమపడి యతికించినవానిలోఁ గొన్ని కరగ్రాహి మొదలైనవారికి వ్రాయఁబడిన యుత్తరములయి యెందునకుఁ బనికిరానివయి