పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

109

ర్పణముచేసెను. లిఖితపూర్వకమయినసాక్ష్యము లేక పెద్దమనుష్యులమాటలను నమ్మి పని చేయఁ బూనుట యీదేశములో క్షేమకరము కాదని నా కప్పుడు మొట్టమొదట బోధపడినది.

ఇఁక మరల మనము మనమునసబుగారి వ్యవహారమునకు వత్తము. నా ప్రాణమిత్రులైన బసవరాజుగవర్రాజుగారు పత్రికానిర్వహణాదులయందు నాకత్యంతసహాయులుగానుండినను, ఆయన కామరాజు గారితోడియల్లుఁ డగుటచేత నే నే యాయన కీవ్యవహారములో నేమియు పని పెట్టకుంటిని. అయినను గవర్రాజు గారుమాత్రము బంధుత్వమును బట్టి కామరాజుగారిపక్షమే చేరవలసినవా రయినను న్యాయైకపక్షావలంబముచేతను స్నేహభావముచేతను నాపక్షమునే వహించి యుండి నేనొకవేళ కామరాజుగారికి విరోధముగా పనిచేయ నియమించినను చేయుటకు సంసిద్ధులయియే యుండిరి. మేమాకాలము నందు ప్రజాక్షేమమునిమిత్తమయి పనిచేయవలసివచ్చినప్పుడు స్వజాతివాఁడనియు బంధువనియు మిత్రుఁడనియుఁ జూచెడివారముకాము. నేనొక నాఁడు ప్రాడ్వివాకన్యాయస్థానమునకుఁ బోయి ప్రచ్ఛన్నముగా నొకమూలఁ గూరుచుండి యాఘనునివర్తన మంతయు సావకాశముగాఁ జూచి వచ్చితిని. నేను వచ్చితినని వినియు వివేకవర్ధనిలోఁ దనమీద వ్రాయఁబడినదానిని జదివియు మొదట నతఁడించుక సంచలించెనుగాని లంచములయం దాఱితేఱిన దైర్యశాలి యగుటచేతను పట్టణములో నత్యంతప్రబలుఁడుగా నుండిన చిత్రపు కామరాజు గారు తనకుమంత్రియయి సహయుఁడయి యుండుటచేతను జంకక లంచములకుఁ గొంకక యెప్పటివలెనే వ్యవహారము నడపసాఁగెను. అంతేకాక వా రిరువును తత్పక్షమువారును జేరి నాకు చెఱుపు చేయ యత్నించుచుండిరి. ఉద్యోగస్థులందఱును వారిపట్టగుటచేత నాకప్పుడు సహాయులు గానుండువారు న్యాయసభలలో నెవ్వరును లేరు. బంటు మొదలుకొని ప్రభువువఱకు నెల్లరును ప్రతిపక్షులకే సహాయులు గా నుండిరి. వివేకవర్ధనిని జదివియు మామండల న్యాయాధిపతిగా రెంతమాత్రమును విచారణ చేయక యుపేక్షించి యూర