పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

107

మహాసత్యసంధులవలెను ధర్మమూర్తులవలెను నటించుచు నన్నుఁజూచి, నే నేమో తమవిషయమున నిష్కారణముగా సందేహపడినట్టు తెలియవచ్చెననియు పద్దమనుష్యులనోటినుండి మాటవచ్చినతరువాత ప్రపంచ మట్టిట్టయినను తప్పిపోవుట యుండదనియు, ఏమేమో నీతివాక్యములు పలికి తాము వాగ్దానము చేసినలేఖ నప్పుడు వ్రాసి యిచ్చెదమని చెప్పిరి. వారావఱకు వ్రాసి యిచ్చెదమన్న విషయములను మాత్రమే కాక నాతో వారు జెప్పినమఱికొన్ని విషయములను గూడ వారిచేత నప్పుడు వ్రాయించి పుచ్చుకొని వారి నిండ్లకుఁబంపివేసితిని. మనలోని పెద్దమనుష్యులు సహితము సమయము వచ్చినప్పుడు బొంకుటకును వంచించుటకును సంశయింపరని చూపుటకయి యింతకుఁ బూర్వము నడచిన యొకచిన్న వృత్తాంతము నీసందర్భమునఁ దెలిపెదను.

రాజమహేంద్రవరమున మావీధికి రెండవవీధిలోఁ గొంతచూపరియు జవ్వనియు నయినయొక వైశ్యకాంత యుండెను. భర్త కురూపియు వృద్ధుఁడు నయియుండుటచేత నాతరుణి కొంత పయియాటల మరగినదయ్యెను. అందుచేత యువజను లనేకు లామెకు వశ్యులయి యుండిరి. ఆకోమటిజవరాలికిని పొరుగింటనే వసించియుండిన యొకబ్రాహ్మణయువతికిని జగడముతటస్థించినప్పు డావైశ్యాంగన 'నిన్నేమి చేయించెదనో చూడు' మని యాబ్రాహ్మణాంగనను బెదరించెనఁట. ఆబ్రాహ్మణయువతి పదునాఱేండ్లప్రాయముగలది; అత్తవారియూరినుండి నవరాత్రములపండుగకు వితంతుమాత పిలుచుకొని రాఁగా పుట్టినింటికి వచ్చియుండినది. ఆతరుణు లిరువును తగవులాడిన మఱునాఁడురాత్రి పదునొకండుగంట లయినతరువాత ముగ్గూరారక్షకభటులాబ్రాహ్మణ గృహముకడకు వచ్చి తలుపు తట్టి కేకలువేసి యాచిన్న దానిని పేరు పెట్టిపిలిచిరి. నిద్రలో కేకలు విని యెవ్వరో తలుపువద్దఁ బిలుచుచున్నారని లేచి వచ్చి తలుపు తీసినయాపడుచును చేయిపట్టుకొని వాండ్రు వీధిలోనికి లాగి, 'నీవు ఆత్మహత్య చేసికొనఁబోవుచున్నావని మాకు సమాచారము తెలిసినది; ఆరక్షకస్థానమునకు నడువుము' అని బలాత్కారముగా నీడ్చుకొని