పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

105

శిఖామణియొక్క దౌర్జన్యములనుగూర్చి మొఱ్ఱపెట్టుకొన నారంభించిరిగాని వారిలో నొక్కరును తాము లంచము లిచ్చినట్టు గాని మునసబు లంచములు పుచ్చుకొనుచున్నట్టుగాని బహిరంగముగా సాక్ష్యమిచ్చుటకు సిద్ధపడినవారు కనఁబడలేదు. రాజకీయశాసనములనుబట్టి లంచము లిచ్చినవారును పుచ్చుకొన్న వారునుగూడ సమానముగానే దోషులయి దండనమునకుఁ బాత్రులగు చుండుటచేత నెవ్వరును మేము లంచ మిచ్చితిమని పైకి వచ్చుటకు సాహసింపకుండిరి. లంచములనుగూర్చి నాతోఁ బలుమాఱు చెప్పుచు వచ్చిన కొందఱు న్యాయవాదులు మాత్రము తాము లంచములిచ్చినట్టు ప్రత్యక్షముగాఁ జెప్పకపోయినను సమయమువచ్చినప్పుడు పయియక్రమములు జరుగుచున్నట్టు చెప్పి సాక్ష్యమిచ్చెదమని వాగ్దానముచేసిరి. నేను వెంటనే నామిత్రులైన చల్లపల్లి బాపయ్యపంతులుగారిని చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రి గారిని మాయింటికి రప్పించి, పయిన్యాయవాదు లావఱకు నాతోఁ జెప్పినదాని నెల్లను మరల వారియెదుటఁ జెప్పించి, మేము మువ్వురమును గలిసి మునసబు లంచములు పుచ్చుకొనుచున్నాఁడన్న యర్థము సూచన యగునట్లుగా చైత్రమాసపత్రిక కింగ్లీషున నొకవ్యాసమును వ్రాసితినమి. ఆవ్యాసము పత్రికలోఁ బ్రకటింపఁబడుటకుముందుగా లంచములు పుచ్చుకొను విషయమును మాత్రము విడిచి తక్కిన విషయముల నొకకాగితముమీఁద వ్రాసి చేవ్రాళ్లుచేసి నాకిచ్చెదమని యన్యాయవాదు లప్పుడొప్పుకొనిరి. ఆవ్రాఁతను బ్రచురపఱుపక నాయొద్దనే యుంచుకొనుటకును సమయము వచ్చినప్పు డాన్యాయవాదులు తద్విరుద్ధముగా సాక్ష్యమిచ్చినప్పుడుమాత్రమే నేను దాని నుపయోగించుటకును నే నొప్పుకొంటిని. నాతోఁజెప్పిన న్యాయవాదులలోఁ గొందఱప్పు డచ్చట లేనందునఁ దరువాత నందఱును జేరివ్రాసి చేవ్రాళ్లు చేసినకాకితమును నాయొద్దకుఁ బంపెద మనిచెప్పి వచ్చినన్యాయవాదులు వెడలిపోయిరి. వ్రాసిన వ్యాస మచ్చుకూర్పఁబడి ప్రకటనమునకు సిద్ధమయ్యెనుగాని న్యాయవాదులు పంపెదమనివాగ్దానము చేసినలేఖమాత్రము నాకు చేరలేదు. మఱునాఁడు