పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

స్వీయ చరిత్రము.

బహిరంగముగానే యుత్కోచస్వీకరణము చేయుచుండిరి. దొరలవద్ద క్రింది యుద్యోగములలో నున్నంతకాలమును లంచములు పుచ్చుకొనుచుండినవారే యైనను, తాము స్వతంత్రులయి ప్రాడ్వివాకపదము నొంది న్యాయకర్తలయిన తరువాత ననేకులు లంచములు మానుచుండిరి. 1878 వ సంవత్స రారంభమున పోలూరి శ్రీరాములుగా రనునతఁడు కొంతకాలము రాజమహేంద్రవరమునకు ప్రాడ్వివాకుఁడు (డిస్ట్రిక్టు మనసబు)గావచ్చెను. ఆయనచెల్లెలిని మామండల న్యాయసభలో దొరతనమువారి న్యాయవాదిగా నుండిన చిత్రపు కామరాజు గారికుమారున కిచ్చివివాహముచేసినందున వారిరువురు నా ప్తబంధులును పరమ మిత్రులునయి యుండిరి. క్రొత్తగా ప్రాడ్వివాకపదమునకు వచ్చినయాఘనుఁడు చిన్నతనమునుండియు చవిగొనుచుండి లంచములు మరగి యున్న వాఁ డగుటచేత నిప్పు డెక్కువయవకాశము కలుగఁగానే తా నచ్చటనున్న కాలములోనే సాధ్యమైనంత యధికధనార్జనము చేయ నిశ్చయించుకొనెను. కాఁ బట్టి యతఁడు వాది, ప్రతివాది, దరిద్రుఁడు, ధనికుఁడు, న్యాయము, అన్యాయము, అని చూడక సర్వభక్షకుఁడైన యగ్ని హోత్రునివలెఁ దన్నుఁజేరినవారి కడనెల్లను ద్రవ్యభక్షణము చేయఁబూనఁగా, ధనంజయునకు ప్రభంజనుఁడు తోడుపడునట్లుగా మహాబలుఁడైన చిత్రపు కామరాజు గా రాయనకు సహాయులయి నిలిచిరి. అందుచేత నాబ్రాహ్మణప్రభువు నిర్భయుఁడయి, ధర్మ దేవతను గోవునుగా మనపూర్వులు వర్ణించియుండుటచేత విపణివీధిలో గోవును విక్రయించునట్టే బహిరంగముగా న్యాయసభలోనే ధర్మమును పాటపాడించి విక్రయింపఁ జొచ్చెను. కాఁబట్టి యీయనకాలములో న్యాయ మెక్కువ పాట పాడినవారిసొమ్మే యగుచుండెను. అప్పుడీన్యాయవిక్రయమునకయి వ్యావహారిక పరిభాష యొకటి క్రొత్తగా నేర్పడవలసివచ్చెను. ఈపారిభాషిక వ్యవహారశాసనమునుబట్టి న్యాయవాదులకు వాదిప్రతివాదులపక్షమున యుక్తులుచెప్పి వాదింపవలసిన శ్రమము తప్పిపోయి పని సులభమయ్యెను. వారు వేఱువాదముతో పనిలేక యానూతనవ్యవహారశాసనముయొక్క ప్రకరణసంఖ్య