పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

101

ధైర్యమునకు సంతోషించి, నా కావఱ కమిత్రుఁడుగా నుండినయొక న్యాయవాది నాతో వెలుపలికి వచ్చి నన్నా లింగనము చేసికొని, మరల మిత్రభావమునుజూపెను. నేను మరలి యింటికిఁ బోవుచుండఁగా నే నాదినమున కారాగృహమునకుఁ బంపఁబడుదునని నమ్మి వింత చూచుటకయి గుంపులుగుంపులుగా న్యాయస్థానమునకుఁ బోవుచున్న మూఢజనులు దారిపొడుగునను నా కెదురుపడి నావంక నివ్వెఱఁగంది చూడఁ జొచ్చిరి. నేను సభవిడిచి వచ్చినతరువాత నామీఁద మాననష్టమున కయి యభియోగము తేవలసియున్నదని మాన్యాయాధిపతిగారు దండవిధాయికి వ్రాయఁగా, ఆతఁ డది వ్యావహారికవిషయమయినందున ముందుగా దొరతనమువారియంగీకారము పొంది యభియోగము తేవలసియుండునని బదులు వ్రాసెను. అప్రతిష్ఠ కలిగించినందునకయి నాపయి నభియోగము తెచ్చుటకు సెల వియ్యవలసిన దని దొరగారు దొరతనమువారికి వ్రాసికొనిరిగాని వా రంగీకరింపరైరి. ఈలోపల నున్నతన్యాయసభవారును దొరతనమువారును ఇచ్చినపట్టాల నెల్ల మరల నూడఁదీసికోవలసినదని మామండలన్యాయాధిపతిగారి కుత్తురువు చేసిరి. ఆయన పైవారియుత్తరువును చెల్లింపఁగా, క్రొత్తగా నంగీలు కుట్టించుకొని నాలుగునెలలభొగ మనుభవించిన నవీనన్యాయవాదులు తమధనమును పట్టాలునుగూడఁ గోలుపోయి కొంతలము నన్నును మావివేకవర్ధినిని శపించుచుండిరి.

ఆకాలమునందు వేశ్యనుంచుకోనివాఁ డరసికుఁ డనియు పౌరుషహీనుఁ డనియు భావింపఁబడుచుండినట్టే లంచములు పుచ్చుకోనివాఁ డప్రయోజకుఁ డనియు బుద్ధిహీనుఁడనియు పరిగణింపఁబడుచుండెను. అప్పుడు లంచములు స్వీకరింప నొల్లని ధర్మపరులయిన రాజకీయోద్యోగులు సహిత మందందుఁ గొందఱుండుచువచ్చిరిగాని యట్టివారిసంఖ్య యత్యల్పమయియుండెడు. లంచములు గైకొనుట యుద్యోగధర్మమని యెల్లవారును దలఁచియుండుటచేత నిచ్చువారుగాని పుచ్చుకొనువారుగాని దానిని తప్పుగాఁ దలఁపకుండిరి. రహస్యమన్నదిలేక బంటుమొదలుకొని మంత్రివఱకును రాజపురుషులందఱును