పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

99

నిప్పుడు మంత్రిస్థానమునందున్న యధికారినగుటచేత వీండ్రకడ నేమియుఁ బ్రచురము చేయఁగూడదు. ఇప్పుడు సర్వమును అగ్ని హోత్రముఖమునఁబడి మండుచున్నది. వీండ్రిప్పుడు మీయాలోచనను గోరవలసినదే" అని పలుకుచు నిలువక గర్వముతో నడచిపోయెను. ఆమధ్యాహ్నమున నాకుఁ బంపఁబడిన యాజ్ఞాపత్రికవ్రాఁత యీయనదే. నాఁడు సూర్యగ్రహణమగుటచే న్యాయసభకు సెలవు. అందుచేత నీయనయే యాజ్ఞా పత్రికను దొరగారియింటివద్ద స్వయముగావ్రాసి సంతకము చేయించి నాకుఁ బంచివచ్చి యిట్లు సాయంకాలసంచారార్థము వెడలెను. ఈయన నాటిప్రాతఃకాలమువఱకు ప్రతిదినమును తప్పక మాయింటికి వచ్చుచు, నాకుఁ బరమాప్తునివలె నటించి యన్ని సంగతులను నావలనఁ దెలిసికొనుచు, నాతోఁ గలిసిమెలసి తిరుగుచుండెను. నేనే పత్రికాధిపతినని చెప్పి దొరగారికి కోపము తెప్పించి యాజ్ఞాపత్రికను వ్రాయించి పంచిన మహానుభావుఁ డితఁడే. వివేకవర్ధినికి భయపడి పైకి మిత్రులవలె నటించుచు లోపల ద్వేషించుచు సమయము వచ్చినప్పుడు నాకు చెఱుపు చేయఁగోరుచుండెడు కపటనాటకు లీయనవలెనే యనేకులుండెడివారు. నే నందఱిని నిజమయినమిత్రులనియే నమ్మెడివాఁడను. దండవిధాయులు న్యాయాధిపతులు మొదలయినవారిమీఁద వ్రాసిన నూరక పోవునా, ఎప్పుడో యొకప్పుడు చిక్కు రాకుండునా, అని తమలోఁ దామనుకొనుచు నాకేదో యాపద వచ్చినట్లు భావించుచు నూర నెల్లవారును నాఁడును మఱునాఁడును ఈ విషయమునే సంభాషించుచుండిరి. సమస్తమునకును న్యాయాధిపతులకెల్లను న్యాయాధిపతియైన యాశ్వరునియందే భారమువైచి నే నారాత్రి నిర్విచారముగా నిద్రపోయి, మఱునాఁడు భోజనముచేసి యథాపూర్వముగాఁ బాఠశాలకుఁబోయిపనిచేసి, రెండుగంటలయినతరువాత సెలవు పుచ్చుకొని యక్కడినుండియే తిన్నగా మండలన్యాయసభకు నడచిపోయితిని. సరిగా మూడు గంటలకు దొరగారును సభకువచ్చిరి. పత్రికాధిపతి వచ్చెనని సిరస్తాదారుగారు దొరగారితో మనవిచేయఁగా ఆయన నాకు కుర్చీయిచ్చి కూర్చుండఁబెట్టి