పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

95

హృదయులయిన వేశ్యాభిమానులగు పూజ్యులు కొందఱు పూర్వాచారమును మరల నుద్ధరించి శాశ్వతకీర్తిని సంపాదింపవలెనని, స్వవాదోపబలార్థముగా నేడుపుటలగ్రంథమును వ్రాసి దానిక్రింద తమపక్షమువారిచేత సంతకములు చేయించుచున్నారు. ప్రశ్నోత్తర రూపముగా వారు వ్రాసిన గ్రంథము మహా సముద్రముంబోలె నున్నందున హాస్యసంజీవని సమగ్రముగా దాని నెల్లరకును జూపలేకపోయినను, దానియందలి హేతురత్నములఁ గొన్నిటి నేరి వా రలంకరించిన మృదువచోభూషణములతోనే యెల్ల వారల చూడ్కులను మిఱుమిట్లు గొలుప నెంచినది. ధీరులారా ! జడిసికొనకుఁడు. -

పంచరత్నములు.

"బ్రాంహ్మడికి గాని పండితులకు గాని యిస్తేఫలంగాని భోగం వాళ్లకు యివ్వడం పుణ్యమా పురుషార్ధమా అగత్యంవుంటే రహశ్యంగా యివ్వకూడదా" "బ్రాంహ్మణులు వగయిరాలకు శుభాఅశుభకార్యములకు యేదయినా ఫలం దొర్కుతుంది. యీభోగం వాళ్ళకు శుభకార్యంకుమాత్రమే దొర్కుతుంది. యితర వర్నములు వార్కిసహా ధర్మం చేస్తూ యిచ్చేవార్నికూడా భోగంవాళ్ళకు వద్దు అనడం న్యాయం కాదు. గొప్ప ఘరానాగల మనిష్యరహస్యంగా యివ్వడం యట్లా తటస్తమవుతుంది? కాదు."
"యీప్రకారం కొన్ని గ్రామాదులలో యట్లారద్దుఅయ్నిది" "యేగ్రామం పద్ధతి ఆగ్రామంకు జర్గవలశ్నిది. వకరు జబ్బుపనిచేస్తే రెండోవారుకూడా జబ్బుపని శాయవలశ్నిదా. యిదిగ్కా వారు యేహేతువచ్తానయినా రద్దు పర్చినయెడల అంద్కు తగిన ప్రతిఫలం కనపర్చె వుందురు."
"బోగంవాళ్ళు లేక పోతే కార్యములుకావా" "భజంత్రీలు లేకపోయినా అవుతవి. బోగంవాళ్ళు లేకపోతే సంసార్లు చెడిపోతారు. గుడిశేటివాళ్ళు విస్తరిస్తారు. రేపుకెజులు యడల్ ట్రీకెజ్లు విస్తరించుతవి."