పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

స్వీయ చరిత్రము.

రావలయునో కాలనిర్ణయ మేర్పఱుపఁబడి యుండక పోవుటచేత నట్టి యేర్పాటు జరిగినదినమునుండి వసువులొసఁగుట మానవలెననుకొంటిననియు, సమాధానముచెప్పి క్షమింప వేఁడుకొనెను. ఆరంభదశలో నెక్కువ తీవ్రతను గనఁబఱచినయెడల నున్న బెట్టుకూడఁ జెడునని మనస్సులో నెంచుకొని ఆతఁడుచెప్పిన సమాధానమును క్షమార్పణమును కాగితముమీఁద వ్రాయించి పుచ్చుకొని, జరిగిన వృత్తాంతమంతయుఁ దరువాత సమావేశమైనసభలో సభవారికి నివేదించితిని, మీఱినయెడలఁ దమవిషయమునఁగూడ నిట్లే జరగునన్న భయముచేత మాయొడంబడికలో వ్రాలు చేసినవారెవ్వరును తరువాత నొసఁగు లియ్య లేదు. మాప్రతిపక్షులైన వేశ్యాప్రియులు వసూళ్లుండ వలసిన యావశ్యకమునుగూర్చి మాసభలలో ప్రసగించుటయేకాక యందు విఫలమనోరథులైనతరువాతఁ దమలోఁ దాము వేఱుగ సభచేసి, మేముచెప్పిన యుక్తుల నాక్షేపించుచు నొక పత్రికను వ్రాసి, వసూళ్లు వేయుట కర్తవ్యమని సిద్ధాంతము చేసి, దానియందు సంతకములు చేయుటకయి తగుమనుష్యులకుఁ బంపిరి. ఈపనిలో మావివేకవర్ధనికి హాస్యసంజీవని తోడయి ప్రతివాదుల యుక్త్యాభాసములను బరిహసించి, మాప్రతిపక్షులైన వేశ్యాజనాభిమాన మాననీయులను సిగ్గుపడునట్లు చేసెను. పలువురు వసూళ్ళు మాని ధనలాభము నొందుచున్నప్పుడు కొందఱుమాత్రము వసూళ్ళు వేయుట గౌరవముగాఁ గాక కేవలవ్యర్థ వ్యయముగాఁ గనఁబడినందున, క్రమక్రమముగా మొదట మాలోఁ జేరనివారు సహితము సభలలో వేశ్యలకు వసువు లొసంగుట మానివేసిరి. ప్రతిపక్షుల యుక్తిరత్నములును మాహాస్యసంజీవని ప్రత్యుక్తులును గొందఱకుఁ గొంతవినోదకరముగా నుండ వచ్చు నని మామండలన్యాయసభలోని యొక మొదటితరగతి న్యాయవాదిగారు చేసినప్రకటనలోని కొంతభాగము గల హాస్యసంజీవనీ వ్యాసము నొకదాని నిందుఁ జూపుచున్నాను. -

సదాచారప్రతిష్ఠాపనము

ఈమధ్య వసూళ్ళు వేయుపద్దతి పోయినందున వేశ్యలకు కలిగిననష్టమునుబట్టి జగత్ప్రళయము సంభవించుననిభయపడి, లోకోపకారార్థము దయార్ద్ర