పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

స్వీయ చరిత్రము.

మని మెట్కాపుదొరగారు మ-రా-శ్రీ, ఫారసీ శ్రీనివాసరావు పంతులుగారి చేత వర్తమానము పంపినప్పుడు నాకక్కఱ లేదని నిరాకరించితిని. ఈసంగతి తెలిసి నాబంధువులును మిత్రులును నన్ను చీవాట్లు పెట్టి, స్వస్థలములోనున్న యాపని కొప్పుకొ మ్మని బలవంత పెట్టిరి. తరువాత వారిహితబోధ యుక్త మయినదని భావించి, పని యిచ్చెదమన్నప్పుడు వలదని నిరాకరించిన నేనే మరలఁబోయి యాపనిని నా కీయవలసినదని ప్రార్థించితిని. నాప్రార్థన యంగీకరింపఁబడినది. అప్పు డాపాఠశాలలో ప్రథమశాస్త్రపరీక్షతరగతి మాత్రమే యుండెను. నేను పనిలోఁ బ్రవేశించినతరువాత రెండుమాసములకు 1877 వ సంవత్సరారంభమునందు మాపాఠశాలలో పట్టపరీక్షతరగతికూడ పెట్టఁబడెను. నాయుపాధ్యాయత్వమునుగూర్చి నేను జెప్పుకొనవలసిన దేదియులేదు. నా కప్పుడు పలువురు క్రొత్తమిత్రు లయిరి. ఈవఱకున్న వారు గాక పత్రికా నిర్వహణాదికమునందు నాకు నూతనముగా మిత్రులైన బుర్రా రాజలింగము శాస్త్రిగారును తోడుపడఁ దొడఁగిరి. నాబాల్యసఖులైన చల్లపల్లి బాపయ్య పంతులుగారును, ధవళేశ్వరములో నున్న కాలములో మిత్రులైన బసవరాజు గవర్రాజుగారును ధవళేశ్వరములోనున్నప్పుడు నాయొద్దకుఁ దఱచుగా వచ్చుచు నాతో మైత్రివాటించిన యేలూరి లక్ష్మీనరసింహముగారును, నాకాప్తులును పత్రికానిర్వహణమునందు సహాయులు నగుచుండిరి. విశాఘపట్టణమండలమునుండి క్రొత్తగావచ్చి మామండలన్యాయసభలో న్యాయవాదు లైన చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రిగారును నాకు మిత్రులయి పత్రిక కెప్పుడైన వ్రాయుచుండెడివారు. నాకు మిత్రు ల నేకులున్నను, ఒక్క పాఠశాలలో నుండుటచేత నేనును బసవరాజు గవర్రాజుగారును బుర్రారాజలింగముశాస్త్రి గారును ఏలూరి లక్ష్మీనరసింహముగారును సదా కలసిమెలసియుండి యత్యంతమైత్రిగలవారమయి పత్రికలో వ్రాయు విషయములను గూర్చియు మాన్పవలసిన దురాచారములనుగూర్చియు నాలోచించుకొనుచుండెడివారము. ఈనలుగురిలోను నేను నాయకుఁడను. వారిలో నిరువురు కొంతకాల ముపాధ్యా