పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

87

రింప నారంభించితిని. బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారికిని నాకును వాగ్వివాదము ముదిరి యన్యోన్యదూషణముక్రింద దిగెనని యీవఱకే చెప్పితినిగదా. ఆయన పూర్వనాగరికుఁడును, నేను నవనాగరికుఁడను, అగుట తప్ప మాయిరువురకును వివాదకారణము వేఱేదియులేదు. వివేకవర్ధని యంత కంతకు వృద్ధియై దేశాభివృద్ధికి భంగకరములైన పూర్వాచారములను పూర్వ పక్షము చేయుచు, దేశాభివృద్ధికరములైన నూతనాచారములను సిద్ధాంతము చేయఁ గడఁగినది. ఆపని పూర్వాచార పరాయణులైన వారి కెవ్వరికిని దుస్సహముగా నుండకపోదు. అట్లయినప్పుడు పూర్వాచారస్థాపన దీక్షాదక్షులలో నెల్ల నగ్రగణ్యులై యపూర్వపత్రికానిశితాసిపుత్రికను చేత ధరించియున్న పంతులవారికి నాపత్రికను రూపుమాపఁ దలంపు గలుగుట వింత కాదు. మా పట్టణములోని ప్రముఖులు ప్రయత్నించి విడిచిపెట్టిన యాపనిని పంతులవారు దూరమునుండి నిర్వహింపఁ బూని వివేకవర్ధనిని పరిహసించి తలకొట్లు కలిగించుటకై 'హాస్యవర్ధని' యను నామధేయముతో నొక మాసపత్రికను సంజీవని కనుబంధముగా 1875 వ సంవత్సరాంతమున వెలువఱిచి పంపిరి. ఆపత్రికాముఖపత్రముపైని దంతిముఖుఁడై విఘ్నేశ్వరుఁ డిరుపార్శ్వములయందును మూషకములు తన్ను సేవింప నిలుచుండి తాండవమాడుచుండెను. మా వివేకవర్ధని వారిసంజీవనికంటె వయస్సున చిన్న దగుటచేత బాల్యచాపల్యమును బూని సాహసముచేసి చలింపక తానును పౌరుషముచూప నుపక్రమించెను. అందుచేత 'హాస్యవర్ధని'తోఁ బ్రతిఘటించి పోరాడుటకొఱకయి యాంధ్రభాషాసంజీవనికి విరోధముగా నప్పుడుదయించిన పత్రికాపుత్రికయే యీహాస్యసంజీవని. హాస్యసంజీవనిలో "కోదుభాషా సంజీవని" యను భాగ మొకటికూడ నుండెను. కోదులనఁగా కొండలయందు వసించెడు భిల్లులవంటి యనాగరికులైన యొక జాతి కొండవాండ్రు. ఈపత్రికాముఖపత్రముపైని సింహముఖుఁడై విఘ్నేశ్వరేశ్వరుఁ డిరుపార్శ్వములయందును మార్జాలములు తన్ను సేవింప నిలుచుండి తాండవమాడుచుండెను. ఆవిగ్రహముక్రిందఁ గూర్పఁబడినశ్లోక మిది. -