పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహుమానుడు దూరాలోచనగలవాడును మిక్కిలి యోగ్యుడును కాబట్టి తనరాజు పెట్టుకొన్నసందేహమునకు లేశమయినను అవకాశము లేదని యెఱిగినవాడయి, విషము పెట్టుటకు మాఱుగా దనప్రభువుయొక్క యాజ్ఞను ఆయనకు నివేదించి, సింహళద్వీపమునుండి తప్పించుకొని యాయనతోడ గూడి వెడలిపోవుట కొప్పుకొనెను. చంద్రవర్మయు బహుమానుని సాయముచేత దనరాష్ట్రములో సుఖముగాఁ బ్రవేశించెను. అప్పటినుండియు నక్కడ రాజసభలోఁ బ్రధానుఁడుగా నుండి, బహుమాను డారాజునకు ముఖ్యమిత్రుడును అత్యంతప్రియుడును నయి యుండెను.

బహుమానుడు పాఱిపోవుటచేత మండిపడి, రాజు మఱింత కోపముతో రాణియున్న యంత:పురమునకు తత్క్షణమే నడచి, అక్కడ తనముద్దులతనయుఁడైన కృష్ణుడు తల్లితో వేడుకగా నేదోకథ చెప్పుచుండగా వినుచు గూర్చున్న భార్యను జూచి, కుమారుని రెక్కపట్టుకొని యావలకీడ్చి, భార్యను చెఱసాలయందు బెట్టబంచెను. కృష్ణుడు మిక్కిలి పసివా డయ్యును తల్లియందు మిగుల ప్రేమకలవాడయి యుండెను. కాబట్టి తల్లిని ఆప్రకారముగా అవమానపఱిచి కారాగృహమునకు బంపుచుండగా జూచినప్పుడు, గుండెలు పగిలిపోయి మనసులో దిగులు పెట్టుకొని, ఆహారనిద్రాదులు మాని దినదినక్రమమున క్షీణించి తుదకు మరణావస్థను బొందు