పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 సుమిత్ర చరిత్రము

నములు పంపుచు వచ్చినందున, మళయాళమునుండి బయలుదేఱి చంద్రవర్మయుఁ బరిమితపరివారముతో మిత్రసందర్శనార్థ మయి సింహళద్వీపమునకు వచ్చెను. ఈసమావేశమువలన జిరకాల మెడబాసియుండి యాకస్మికముగా గలిసిన యా మిత్రుల కిరువురకును గలిగిన యానంద మింతింత యని చెప్ప నలవి కాదు. రాకరాకవచ్చిన తన చిన్ననాటిమిత్రునకు సకలోపచారములను జేయుచు జక్కగా బరామర్శింప వలయు నని భార్యకు బోధించుటయే కాక, తన ప్రాణసమాను డయిన బాల్యమిత్రుడు సరసనుండి చూచుచుండబట్టి యిప్పుడుకదా నాసౌఖ్యము పరిపూర్ణత గాంచె నని సుమిత్రుడు మనసులో బరమానంద భరితుడయియుండెను. మిత్రు లిద్దఱును పూర్వ కాలమును గూర్చి ముచ్చటించుచు, బాల్యావస్థయందు దాము చదువుకొన్న సంగతులను, చిన్ననాటి యాటపాటలను తోడిబాలురతోడ గూడి విహారమునకు బోయినప్పుడు నడచినచర్యలను దలచుకొని యానందించుచు, వారిసల్లాపముల యం దెల్లప్పుడును నుల్లాసమును గనబఱచుచు సమీపమున నుండు మంజువాణితో వేడుకగా జెప్పుచుండిరి. ఇట్లు కొంత కాలము సుఖముగా జరిగినతరువాత చంద్రవర్మ తనదేశమునకు వెళ్ళుట కయి ప్రయాణము కాగా భర్త కోరిక ప్రకారము మఱికొంతకాలముండి వెళ్లు మని యాతనిని మంజువాణి ప్రార్థించి చెప్పెను.