పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమిత్ర చరిత్రము 27

జేసినందునకయి గొల్లవానిని బహువిధముల గొనియాడిరి. తాము చేసిన ప్రయత్నములన్నియుఁ దుద కనుకూలముగా ఫలించినందున బహుమానుఁడును మిత్రవిందయు నమందానందము నొందిరి. ఎవ్వరును ప్రతీక్షింపని యీసంతోషములో నేదియు లోపము లేకుండ; జేయుటకో యన జంద్రవర్మసహిత మప్పుడు వచ్చి రాజమందిరమును జొచ్చెను. ఆతఁడు మొట్టమొదట గొడుకును బహుమానుడును గనబడకపోయినప్పుడు ఆవఱకే బహుమానుడు స్వదేశమునకు బోవగోరి యున్న సంగతి నెఱిగినవాడుగాన వారిరువురును సింహళ ద్వీపములో దొరకుదురని యూహచేసి, సాధ్యమయినంత శీఘ్రముగా బయలుదేఱి, సుమిత్రుని జీవితకాలములో నెల్లను మిక్కిలి సుదినమయిన యీ సంతోషసమయముననే యచ్చట నుట్టిబడెను.

చంద్రవర్మ వారితోఁగూడ సంతోషము ననుభవించుటయేకాక, అక్రమముగా దనమీద జారత్వశంకను మోపిన సుమిత్రుని యపరాధమును మన్నించి బాల్యములో నాతనితో నెంతమైత్రి గలిగియుండెనో యిప్పుడును మరల నంతమైత్రి గలవాడాయెను; చంద్రవర్మ ప్రమతిని తన కొడుకునకు జేసికొననని నిరాకరించునన్న భయమిప్పు డేమియులేదు. ఇప్పుడామె కులహీనురా లయిన గొల్లపడుచుగాక, సింహళ ద్వీప రాజ్యమున కుత్తరాధికారిణియైన రాజయువతి యాయెను.