పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున్నట్టుకూడఁ గనుపట్టుచున్నది" అని రాజు బహుమానునకు జూపెను. ఇంతలో మిత్రవింద "దేవరవారి కిప్పుడు గలిగిన సంతోషమునుబట్టి విచారింపగా అది జీవించియున్నదని సహితము తలంతురు. ఇప్పుడు నేను తెరవేయవలెను" అనెను. రాజు "మిత్రవిందా! ఇరువది సంవత్సరము లయినను నన్నాలాగుననే తలఁచునట్లు చేయుము. ఇప్పుడును ఆ దివ్యసుందర విగ్రహమునుండి యూపిరి వచ్చుచున్నట్లే నాకుఁ గనబడుచున్నది. ఎంతవింతయులియైనను విగ్రహమున కూపిరివచ్చునట్టు చెక్క గలుగునా? దానిని పోయి యొక్కసారి ముద్దుపెట్టుకొనెదను; మీరెవ్వరును బరిహసింపకుడు" అని మోహపరవశు డయి పలికెను. "దేవా! తాళుఁడు, ఆమె పెదవికివేసిన యెఱ్ఱరం గింకను పచ్చిగానే యున్నది; మీరు ముద్దుపెట్టుకొందురేని మీపెదవి కంటుకొనును. నేను తెర దిగవేయుదునా?" అని మిత్రవింద యడిగెను. "వద్దువద్దు" ఇరువదియేండ్లయినను అలాగుననే యుండనిమ్మ"ని రాజు వేఁడుకొనెను.

ఈ సంభాషణము నడుచుచున్నంతతడవును మోకాలిమీఁద నిలువబడి నోరు కదలింపక సావధానముగా జనని యొక్క నిరుపమానమైన విగ్రహమువంకనే చూచుచున్న ప్రమతి "నా ప్రియమాతవంక జూచుచు, ఎంతకాలమయిన నీప్రకారముగా నిలుచుచుండగల"నని పలికెను. అంతట మిత్రవింద రాజువంక జూడ్కి నిగిడించి, 'యీ యాలోకనసౌఖ్య