పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలసినదని యావృద్ధుని నడిగెను. రాజంతట మాఱువేషమును దీసివేసి నిజస్వరూపముతో కొడుకును గద్దించుచు "వివాహ విమోచనమును జూచెద"నని పలుకుచు వెఱ్ఱిగొల్ల వానియింటఁ బుట్టిన యీ కులహీనురాలిని వివాహము చేసికొన సాహసించి నందులకయి పలువిధముల నిందించి ప్రమతివంక జూచి "యిక ముందెప్పుడైన నీవు నాకొమారుని మరల నిక్కడకువచ్చుట కంగీకరించితివేని నిన్నును నీతండ్రియైన ముసలిగొల్ల వానిని గూడ క్రూరముగా జంపించెద" నని బెదరించెను. తక్షణమే బహుమానునితోఁ దనకొమారుని వెంటఁబెట్టుకొనిరమ్మని చెప్పి, మహాకోపముతో రాజు తాను ముందుగా మందిరమునకు బోయెను.

రాచబిడ్డయొక్క స్వభావము దాగియుండదు కాబట్టి రాజు వెళ్ళినతరువాత ఆతని దూషణభాషణముల వలన గోపమువచ్చినదయి ప్రమతి, "మన కందఱకును హాని ప్రాప్తము గానున్నను, నేనిప్పు డేమియు భయపడ లేదు; ఒకటిరెండు మాఱులు రాజును పలుకరించి, ఆయనతో మీ రాజభవనము మీద ప్రకాశించుసూర్యుడే సంకోచపడక మా కుటీరనిలయముమీఁద సహితము ప్రకాశించుచు మిమ్మును మమ్మును సమానదృష్టితోనే చూచుచున్నాడని స్పష్టముగా మొగము మీఁదనే యనవలె ననుకొంటి" ననిపలికి, పిమ్మట విచారగ్రస్తురాలయి "యీవఱకు నేనేమో కలగనుచున్నాను కాఁబోలు! ఇప్పుడు