పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌందర్యవతియై యౌవనదశను పొందెను. ఆమె గొల్లపిల్లలు సాధారణముగా నేర్చుకొనుదానికంటె విశేషవిద్యను నేర్చుకొన్నది కాకపోయినను, ఆమెస్వభావసిద్ధములైన తెలివితేటలను నడవడికను జూచినవా రందఱును చిన్న నాటినుండియు నామె రాజమందిరములోఁ బెరిఁగినది కాదని యెంచుట కవకాశము లేనివారుగా నుండిరి.

మలయాళదేశపు రాజైన చంద్రవర్మకును రామవర్మ యను పేరుగల కొమారు డొక్కఁడే యుండెను. అతఁ డొకనాడు వేటకు బోయి ఆగొల్ల వాని యింటిసమీపముననుండి వచ్చుచు గుమ్మములో నిలుచున్న ఆచిన్నదానిని జూచి ఆమెయొక్క రూపలావణ్యాదుల కద్భుతపడి, మోహపరవశు డయ్యెను. అతడు తక్షణమే మాఱువేషమును వేసికొని కందర్పుఁడను పేరున నాగోపగృహమునకు బోయి నాడు మొదలుకొని తఱుచుగా వానియింటికి రాకపోకలు చేయుచుండెను. చంద్రవర్మయు దనకొమారుడు మునుపటివలె నిల్లు పట్టక తిరుగుచుండుటచూచి సందేహపడి, అతని జాడలను కనిపెట్టుటకై 'దూతలను, నియమించి, వారివలన దనపుత్రుడు గోపకామినిమీద మనసుతగిలియుండుటను దెలిసికొనెను. చంద్రవర్మ వెంటనే తనప్రాణమిత్రుడైన బహుమానుని రప్పించి, ఆసంగతియంతయు నతనితోఁ జెప్పి, ప్రమతితండ్రి యైన గొల్లవానియింటికి, దనతోఁగూడ రమ్మని కోరెను.