పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రును, న్యాయాధికారులును, మంత్రులును రావింపఁ బడిరి. అప్పుడు వారందఱి యెదుటను వీసమంతయు దోషములేని యాయోషిద్రత్నము మహాపరాధము చేసినదానివలె దీనత్వముతో నిలువబడి వారుచెప్పుతీర్పును వినుట కయి యెదురు చూచుచుండెను. ఇంతలో సత్యసారుడును చతురాస్యుడును సభామంటపము ప్రవేశించి, పదిలముగా ముద్రవేసి భద్రపఱిచి తెచ్చిన దేవతావాక్యములుగల యుత్తరమును సగౌరవముగా రాజునకు సమర్పించిరి. అప్పుడు రాజుయొక్క యాజ్ఞానుసారముగా సభికులలో నొకడు ముద్రను విడగొట్టి, అందులోని వాక్యము లందఱకు వినబడునట్లుగా నీప్రకారము చదివెను. - "మంజువాణి కేవలము నిరపరాధిని; చంద్రవర్మ కళంకరహితుడు; బహుమానుడే నిజమైన భృత్యుడు; సుమిత్రుడు నిష్కారణముగా జారత్వశంకను బెట్టుకొన్న క్రూరుఁడు; ఇప్పుడు చంప బంపబడినకూతురు దొరకకపోయినయెడల రాజు సంతులేనివాఁ డయి మృతినొందును." - రాజు ఆమాటలయం దెంత మాత్రమును విశ్వాసముంచక, ఇదియంతయును రాణియొక్క మిత్రులచేత పన్నఁబడిన తంత్ర మని పలికి, న్యాయాధిపతి కభిముఖు డయి నీవు రాణిని విమర్శించుట కారంభించు మని యాన తిచ్చెను. భూపతి యీమాటలు పలుకుచుండఁగానే, ఒకసేవకుడు కొలువుకూటమునకు బరుగెత్తుకొనివచ్చి రాజు గారి పుత్రుడైనకృష్ణుడు తనతల్లిని ప్రాణాంతశిక్షను పొందిం