పుట:Sukavi-Manoranjanamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుకవి మనోరంజనము

ప్రథమాశ్వాసము

అవతారిక

శ్రీమహిలాధినాథ సరసీరుహజాత శచీకళత్ర ము
ఖ్యామరసార్వభౌమ మకుటామితరత్నవిభా ఝరీ పరీ
షామలపాదపద్ము మిహికాంశుకిరీటు ధర్మాత్మజామిల
త్కోమలమూర్తి పీఠపుర కుక్కుటలింగవిభుం దలంచెదన్.

1


చ.

వలిమలఁ బుట్టి విన్ను[సిగవాని] యొడల్ సగ మాక్రమించి ని
చ్చలు ప్రియమందఁగాఁ బ్రియుఁడు సామజవక్త్రకుమారులం గుమా
రులఁ గని పన్నమన్నరుల రూఢిగఁ బ్రౌఢిగఁ బ్రోచు సర్వమం
గల కృప సర్వమంగలనికాయము లేయెడ మాకు సేయుతన్.

2


శా.

శ్రీలానీలలఁ గేలులం దనుఫుచుం జేజేల జేజేల క
ల్యాలాపధ్వనులం గ్రహింపుచుఁ గృతోద్యన్మాద్యదింద్రాది శి
క్షాలక్షుండును [సర్వవి]శ్వపరిరక్షాదక్షుఁడౌ గోపకాం
తాలోలుండు కృపామృతామిత నిపానంబై మముం బ్రోచుతన్.

3


ఉ.

కల్యసముజ్జ్వలజ్జలజ గర్భదలోపమమున్ శుభాలిసా
కల్యవదాన్యతాపరమకారణముల్ నిజపాద భక్త హృ
చ్ఛల్యనివారణంబులు సుధాకరసోదరి చూపులెల్ల మాం
గల్యము లిచ్చు గావుత నికామకృపారసభాసితంబులై.

4