పుట:Subhadhra Kalyanamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల దక్షిణమ్మున - వెలసిన యట్టి
అలతి నదుల తీర్థ - ములనాడే క్రీడి
మునుకొని యటు పద - మూడవ నెలను
పనిబూని మణిపురి - పట్టణమ్మునకు
అరిగె నప్పర మేలు - నవనీశ్వరుడు
బలవిక్రముడు చిత్ర - వాహనుం డపుడు
ఎదురేగి తోడ్తెచ్చి - హేమపీఠమున
వదలని భక్తితో - వాసవి నునిచి
అడుగుల నర్ఘ్యపా - ద్యముల బూజించె
సురపతి సుతుడు వ - చ్చుట వైపు దెలిసి
కౌంతేయు డిష్ట మా - ర్గమున జిక్కునని
యంతంత మది నుబ్బి - యర్జును జూచి
యేను నీ కొకమాట - నెఱిగించవలెను
మానవాధీశ్వర = మావంశ మందు
ఘన విక్రముడు ప్రభా - కరుడను రాజు
 తనయుల కొరకు దా - దడయకెంతెంతో
తపనుజేసిన చంద్ర - ధరుడును మెచ్చి
అపుడు దానొక మాట - నరుదుగ బలికె
వసుధేశవరుడ నీ - వంశ వీరులకు
పొసగంగ నొక్కొక్క - పుత్రుండు పుట్టు
అని యిచ్చె వరమీశు - డతని వరమున