పుట:Srivemanayogijiv00unknsher.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీ వేమనయోగి జీవితము.

మహానుభావుల చరితములు అప్రతిమానవిరాజితములు, వానివైభవము జెప్ప నలవిగానిది. అందలి యభిప్రాయములు సాధారణముగా నందఱికిని బోధపడునవి కావు. ఇట్టిమహానుభావులు నూటికి కోటికి యొక్కరైన నుండుట యరుదు. ఎచ్చటనైన మనము చేసిన పుణ్యముకొలది లభించిరేని యట్టివారినే ముందు పూజింపవలయును. వీరుఅందఱివలె సామాన్యమనుష్యులలో జేర్పతగినవారు కారు. ఇట్టివారు భూలోకమున జనించి మహాకార్యముల ననేకములను జేసి జనుల తరింప జేయుదురు. తత్త్వము నుపదేశించెదరు. వీరు కేవలము ఈశ్వరాంశసంభూతులై పుట్టెదరు. ఏ దేశమున నైనగాని ఏకాలమున నైనను గానీ దాంభికులు కొండఱు బయలుదేరి ప్రజలను, అసత్యమతమునందును అబద్ధపు జాతులయందును నెట్టి వంచించి దారిజూపక స్వకీయులనియైన నాలోచింపక బాధించుచుండుట సహజము. అట్టిసమయమున భగవంతుని యనుగ్రహముచే తదంశమున జనించి అసత్యబోధకములగు జాతిమతముల రూపు