ప్రస్తుతకార్యము.
ఇప్పుడు బజారులో ముద్రాపకులు కొందఱు ముద్రించి విక్రయించుచున్న "వేమన పద్యములు" మున్నగు పేరులుగల వేమనగ్రంథములలో చాలా చిత్రములగు మార్పులు కలుగుచున్నవి. అట్టిమార్పులను చేయుచుండుట ఒకరికంటె ఒకరు పద్యముల నెక్కువ గూర్చితిమని ప్రతిష్ఠ నొందుటకో? లేక కనబడిన ప్రతిపద్యమునకు కర్తృత్వము నారోపించి వేమనయెడల దమకున్న నద్భుతకృతజ్ఞతను వెల్లడించు నుద్దేశముతోనో ఏమొ చెప్పజాలము కాని సుమతిశతకము మున్నగు గ్రంథములనుండి రమణీయములని తోచిన ప్రతిపద్యమునకు చివరపాదమున నుండు "సుమతీ, కుమారీ" మున్నగు పదములను తీసివైచి "వేమా" అని కూర్చి కొన్ని పద్యముల నధికముగా జేర్చి సంఖ్యాపూరణమును జేసిరి.
ఇకగొందఱు అసలు బంగారమునకు బదులుగా నిర్మించిన గిల్టువలె వేమనపద్యమునకే యొక్కొక్కదానికి యొకటిరెండు నాల్గైదు వఱకును నకళ్లను కల్పించి గ్రంథసంఖ్యను పెంచి పెద్దదానిని చేసిరి. మఱియును గొందఱు "తమది కొంతయును త్రాళ్లపాకవారిది కొంత" యనునట్టులు వేమనయచ్చటచ్చట సత్యప్రతిపాదమునకై గావించిన పరిహాస