పుట:Srivemanayogijiv00unknsher.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెను. నరసాంబయును ఆరాత్రి ప్రభువు భోజనమును చేసి సరసములందుండునప్పుడు మెల్లమెల్లగా దగ్గఱజేఱి బంగరుకమ్మ నొకదానిని చూపి "దీని జతదిపోయినది దీనిమాదిరిది నాకు ఱేపే కావలయును, దేవరతలచిన కొఱతయేమి? కావున నభిరామయ్యను రేపుతెల్లవాఱకముందే యిచ్చటికివచ్చి దుకానము తెఱచి రెండుజాములలోగానే సిద్ధము చేయులాగున నాజ్ఞాపింపవలయును" అనికోరెను. ప్రభువునట్టులే యనిపలికి వెంటనే యభిరామయ్యను బిలిపించి రాణిచెప్పిన చొప్పుననే ఖచితముగా నాజ్ఞనిచ్చి యంపి వైచెను. అభిరాముడింటికిబోయి విచారసాగరమగ్ను డై దరిగానక కొట్టుకొనుచుండెను.

'ఎన్నిరోజులనుండియో మేఘోదకా కాంక్షియగు చాతకపోతకమువలె నోరుదెఱచికొని ఎప్పుడు సిద్ధునియనుగ్రహము కలుగునాయని యెదురుసూచుచుండ నేటికియ్యదిఫలోన్ముఖమయ్యును పూర్వకృతకర్మమాహాత్మ్యముచేత గాబోలు విముఖమైపోవు గతిపట్టినది. ముందునూయియును, వెనుకగోయియును కదా? ఎట్టులు చేయుదును, జీవికను వదలుకొందునా? బ్రదుకుట యెట్లు? పోనీ యోగియుపదేశమునే వదలి పెట్టుదునా? బ్రదికి ప్రయోజనమేమి కలదు?