పుట:Srivemanayogijiv00unknsher.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి యభిరామయ్య నియతముగా సూర్యోదయమునకే వచ్చుచుండె ననుకొందురా? లేదులేదు. మఱల యెప్పటియట్లే జాగుచేయుచుండెను. కొంతకాలము తఱువాత "చెప్పిననుకూడ తనయిచ్చవచ్చినట్లే చేయుచుండుట" వేమనను సరిగా గూరుచుండ నిచ్చినది కాదు. కావున మునుపటికంటె మిక్కిలిగా నాగ్రహించి పలికెను. ఆమాటనువిని యభిరామయ్య మనస్సులో నెంతటివిచారమును తెంపును బొందెనో గాని లేచి చేతుల గట్టికొని "మహాప్రభూ! జననమునుండియును దేవరయన్నోదకములచే పెఱిగినమేను లియ్యవి కావున నొకప్పుడైనను తమయాజ్ఞ నిసుమంతనైన నతిక్రమింపజాలము. కాని యీ తమనౌకరు ప్రతిదినమును స్నానము సంధ్య జపము తపము మొదలగువానిని ఆచరించికొనవలసియున్నది అందుచేత నాలస్యమగును. కాన జాముప్రొద్దగునప్పటికి గానిరాజాలను. క్షమింపవలయును." అనిపలికెనట! వేమన్నయు నందులకు కినిసి "నగరిపనికి నిష్ఠ లడ్డమువచ్చునా ? నీకర్మములను ముందుగానే తీర్చికొని మేము చెప్పినట్టులు ప్రతిదినమును నియతసమయమున వచ్చి పనిజేయకతప్ప"దని చెప్పి వెడలిపోయెను. ఈసంగతి ఎట్లో వేమన్న యన్నగారు విని "కొంపలవెంట దిఱుగు కోనంగి దాసరికంటెను కుటుంబియై గుణియై దైవభక్తిగల