పుట:Srivemanayogijiv00unknsher.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన్న యాత్రకు పోయి ఉత్సవ మంతయును సమాప్తమై వచ్చిన యాత్రికు లందఱును మఱలి స్వగృహములకు బోయినను ఇతడుమాత్ర మటనుండి పోకయుండుట గని యచ్చటి యర్చకుడు సందేహము జెంది "యాత్రికులందఱు వెడలిపోయినను ఈయడవిలో నొంటరిగా నీవెందులకుంటివి? అని యడిగెనట. అందునకు కోమటివేమన్న ఒక సంవత్సరమిటనుండ తలపుగొంటినన సరి నీవుండ వచ్చును కాని దేవాలయమున కుత్తరపుదిక్కునకు మాత్రమెప్పుడును బోకూడదని యర్చకుడు పలికెను. అటుతఱువాత నొకనాడు కోమటివేమన్న తనలో తాను ఈదేవలుడు నన్నుత్తరమునకు బోవద్దని యనుటకు గారణ మేదియైన నుండనోపును; అదికను గొనియెద ననినిశ్చయించికొని అడవిలో పోయిన త్రోవను గుర్తుపెట్టికొనుటకై తన చెఱగున నున్న నువ్వులను దారి కిరుప్రక్కలను చల్లుకొనుచు పోయి అక్కడ కొన్నిరోజులుండి పరిశోధించి యచ్చట పరసవేదియుండుటను తెలిసికొని మఱునాడు రెండు కుండలను సంపాదించికొని కావడి గా నమర్చికొని పరసవేదిని నింపుకొని ఇతరులకు తెలియకుండ పైని గడ్డిగాదము గప్పికొని యనుముకొండకు చేరి రాత్రిసమయ మగుటచేత దొంగలబాధకు భయపడి అలియరెడ్డి యింటికి పోయి ఆయనవలన ఆరాత్రి