Jump to content

పుట:Srivemanayogijiv00unknsher.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకారెడ్డి, వేమనవంశీయులందఱును పంటరెడ్లతెగలో జేరినవారును శైవమతాభినివేశము గలవారలునై యుండిరి. పంటరెడ్ల యాస్థానకవులే గదా! మన యాంధ్రభాషాప్రపంచమున ననుపమానపాండిత్య ప్రతిభాశాలురని ప్రసిద్ధిజెందిన శ్రీనాథ భాస్కరాదికవులు.

కోమటి వేమన్న కథ.

వేమారెడ్డివంశమునకు మూలపురుషుడు దొంతి అలియరెడ్డి యనువారు, ఈయన ఆ కాలములో ననుముకొండయందు నివసించుచు వ్యవసాయము జేసికొని సామాన్యుడగు కర్షకునిబోలి జీవించుచున్నను ధనికుడనియే పేరొందెను. ఈయలియరెడ్డిని గూర్చి జనులిట్లు తలంచుట కొక కారణమును గా నీక్రిందికథను చెప్పెదరు. మున్నొకప్పుడు వేమన్న యనుపేరుగల కోమటి యొక్కడు యాత్రార్థియై శ్రీశైలమునకు జని భ్రమరాంబికా మల్లేశ్వరుల సేవలొనర్చుకొని కొంతకాల మచట నివసించెనట! శ్రీశైలపర్వతము అరణ్యమధ్యమునం దుండుటచేత యాత్రికు లెప్పు డనిన నప్పు డచ్చోటికి బోవరు. సంవత్సరమున కొకతూరి మహాశివరాత్రి కాలమున దర్శనార్థులై ప్రజలు గుంపులు గుంపులుగా గూడి యడవిజంతువుల వలని బాధలేకుండ కట్టుదిట్టములను చేసికొని పోవుచుందురు. మనకథలోని కోమటి